బయటకు వచ్చే సాహసం చెయ్యొద్దు: సీపీ సజ్జనార్‌

23 Mar, 2020 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ పిలుపు నేపథ్యంలో రవాణా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. ప్రజలు బయటికి వచ్చే సాహసం చేయొద్దని అన్నారు. వైరస్‌ భయాల నేపథ్యంలో ఇంటి వద్ద ఉండడానికే ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిందని.. బయట తిరిగి వాటిని దుర్వినియోగం చేయొద్దని పేర్కొన్నారు. నిత్యావసరాలకు కూడా సమీపంలో ఉన్న దుకాణాలకే వెళ్లాలని, దూర ప్రాంతాలకు  వెళ్లొద్దని సూచించారు. అన్ని దుకాణాలు ఉదయం 6 గంటలకు తెరచి సాయంత్రం 7 గంటలకు మూసేయాలని చెప్పారు.
(చదవండి: తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు: ఈటల)

ఇటలీ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం..
ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కమిషనర్‌ సూచించారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు నుంచి ఆరు ఫీట్ల దూరం పాటించాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు. మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకిందని, వైరస్‌ ఇప్పుడు రెండో దశలో ఉందని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే తీసుకుంటే విపత్తును అడ్డుకోవచ్చని అన్నారు.

వైరస్‌ పుట్టుకొచ్చిన చైనా కంటే ఇటలీలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం.. అక్కడ సామాజిక దూరం పాటించకుండా... విచ్చలవిడిగా, గుంపులు గుంపులుగా సెలబ్రేషన్స్‌ చేసుకోవమేనని సీపీ సజ్జనార్‌ గుర్తు చేశారు. సామాజిక దూరం పాటించకపోతే.. వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని, అది ఎంతో ప్రమాదకరమైందని చెప్పారు.
(చదవండి: కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు)

మరిన్ని వార్తలు