కరోనా వైరస్‌: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

2 Mar, 2020 20:02 IST|Sakshi

లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

వైరస్‌ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

మీడియా సమావేశంలో మంత్రి ఈటల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : కోవిడ్‌-19 వ్యాప్తి కాకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా కేసు వివరాలను వెల్లడించారు.
(చదవండి: ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు)

‘బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు (24) కంపెనీ పని నిమిత్తం ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందినవారితో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగుళూరుకు చేరుకున్నాడు. జ్వరం రావడంతోనే ఫిబ్రవరి 27న అక్కడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో మార్చి 1న సాయంత్రం 5 గంటలకు సదరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ అని తేలింది. నిర్ధారణ కోసం నమూనాలు పుణెకు కూడా పంపించాం.. అక్కడ కూడా పాజిటివ్‌ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

కరోనా సోకిన వ్యక్తి ప్రయాణించిన బస్సులో 27 మంది ప్రయాణించినట్టు తెలిసింది. ఆ 27 మందిని ట్రేస్‌ చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల్లో ఇప్పటికీ 80 మందిని గుర్తించాం. వారందరికీ టెస్టులు చేస్తాం. కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.
('కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.. వాటి కోసం చూస్తున్నా')

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి, టెస్టులు చేయించుకోవాలి. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసాం. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జనసమ్మర్థ ప్రదేశాల్లో ఉంచుతాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్పెషల్‌ ఫండ్‌ అవసరమైన పక్షంలో తీసుకోండని సీఎం చెప్పారు’అని ఈటల పేర్కొన్నారు.
⇒ కరోనా వైరస్‌పై హెల్ప్‌లైన్ నెం: 011-23978046

(చదవండి: బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది)

మరిన్ని వార్తలు