కరోనా అలర్ట్‌: ఉస్మానియాలో నిర్ధారణ పరీక్షలు!

10 Mar, 2020 20:44 IST|Sakshi

కోలుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇటీవల కోవిడ్‌-19 పాజిటివ్‌గా నమోదైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కోలుకున్నాడని తెలిపారు. వైరస్‌ బారిన పడిన సాఫ్ట్‌వేర్‌ యువకుడికి తొలి‌ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, రేపు పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రెండో రిపోర్టు రానుందని ఆయన మీడియాతో మంగళవారం అన్నారు. మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
(చదవండి: నో కోవిడ్‌.. హైదరాబాద్‌ సేఫ్‌!  )

ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో మాట్లాడాను. విదేశాల నుంచి తిరిగి వస్తున్న వారందరికీ స్క్రీనింగ్‌ చేయాలని కోరాం. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అనుమానితుల్ని ఐసోలేషన్ వార్డుకు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై అధికారులతో మరోసారి సమీక్షించాం. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు గాంధీలో మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉస్మానియాలో‌ కూడా పరీక్షలు చేయడానికి అనుమతి వచ్చింది. రెండు స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ మిషన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం’అని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు