6 నెలల్లో ఔషధం..

18 Mar, 2020 02:02 IST|Sakshi

కరోనాకు ఉమ్మడిగా 3 మందుల తయారీకి సిద్ధమైన ఐఐసీటీ, సిప్లా

రెమిడెస్‌విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్‌ రసాయనాలతో అన్ని వైరస్‌లకు చెక్‌

ఇప్పటికే ఒకట్రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి

వాటిని మాత్రలుగా అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొచ్చిన సిప్లా

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తోపాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. కరోనా వైరస్‌కు విరుగుడుగా పనిచేయగలవన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన మూడు మందులను తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయి. రెమిడెస్‌విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్‌ అనే మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. (మరో ముగ్గురికీ కరోనా)

ఈ మూడు మందులపై ఒకట్రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని, వేర్వేరు కారణాల వల్ల మార్కెట్‌లోకి రాని వాటిని అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉండటం విశేషమని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రెమిడెస్‌విర్‌ను గిలియాడ్‌ అనే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిందని, జపనీస్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఫెవిపిరవిర్‌పై పేటెంట్‌ హక్కులు కూడా లేవని ఆయన తెలిపారు. రెమిడెస్‌విర్‌పై చైనా ఇప్పటికే వెయ్యి మంది రోగులతో ప్రయోగాలు నిర్వహించిందని గుర్తుచేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని మందులను నిశితంగా పరిశీలించడం ద్వారా తాము ఈ మూడు మందులను కరోనాతోపాటు ఇతర వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఉపయోగించవచ్చన్న అంచనాకు వచ్చామని చెప్పారు. (14 రోజులు ఇంట్లోనే ఉండండి)

సిప్లా అధినేత డాక్టర్‌ హమీద్‌ మంగళవారం ఐఐసీటీకి మెయిల్‌ పంపుతూ ఈ మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని, ఇందుకు తగ్గట్లుగా తాము వాటిని ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రెండు మందులను (రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్‌) కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని ఆయన వివరించారు. ఆ తరువాత కొన్ని ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు. ఈ మందుల తయారీకి కావాల్సిన అన్ని రకాల రసాయనాలు ఐఐసీటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1980లలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ప్రపంచాన్ని కబళిస్తున్న సమయంలో ఐఐసీటీ, సిప్లా అత్యంత చౌకగా యాంటీ రెట్రో వైరల్‌ మందులను అభివృద్ధి చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

పిచికారీ మందు తయారీ సులువే...
కరోనా వైరస్‌కు విరుగుడుగా బహరంగ ప్రదేశాల్లో పిచికారీ చేసేందుకు వీలైన మందుపై ఐఐసీటీ మదింపు చేసిందని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (రెండు శాతం గాఢత), పెరాసిటిక్‌ యాసిడ్‌ (0.2 శాతం గాఢత)లను నీటితో కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల ఉపరితలాలపై ఉండే వైరస్‌లు ఎనిమిది నుంచి పది నిమిషాల్లో నశించిపోతాయని చెప్పారు. దీంతోపాటు కరోనా వైరస్‌ ఉనికిని నిర్ధారించే కిట్‌లలో కీలకమైన ఎంజైమ్‌ (రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్టేస్‌) ఉత్పత్తిని ఐఐసీటీ చేపట్టిందని, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) వద్ద ఉన్న ప్రైమర్‌తో కలిపి దీన్ని వ్యాధి నిర్ధారణ కిట్‌లలో ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే )

మనమూ తయారు చేయొచ్చు
ఆరుబయట.. ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్‌ను చంపేయాలని అనుకుంటున్నారా? మీకు కావాల్సిందల్లా హైడ్రోజన్‌ పెరాక్సైడ్, పెరాసిటిక్‌ యాసిడ్‌ రసాయనాలే. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మార్కెట్‌లో రెండు గాఢతల్లో లభిస్తుంది. 4% గాఢత ఉన్న దాన్ని వాడే పక్షంలో ప్రతి లీటర్‌ నీటికి ఆరు ఎంఎల్‌ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడాలి. ఇది కాకుండా 30% గాఢత ఉన్న దాన్ని వాడుతున్నట్లయితే ఒక లీటర్‌ నీటికి 0.82 ఎంఎల్‌ వాడాలి. ఇక పెరాసిటిక్‌ యాసిడ్‌ విషయానికి వస్తే దీన్ని ప్రతి లీటర్‌కు 0.42 ఎంఎల్‌ చొప్పున వాడా ల్సి ఉంటుంది. మొత్తమ్మీద చూస్తే ఒక లీటర్‌ నీరు తీసుకొని దానికి 6 ఎంఎల్‌ (4% గాఢత) హైడ్రోజన్‌ పెరాక్సైడ్, 0.42 ఎంఎల్‌ పెరాసిటిక్‌ యాసిడ్‌ కలిపి కావాల్సిన చోట పిచికారీ చేసుకోవాలి. ఈ మందుతో వైరస్‌ లేవైనా 10 నిమిషాల్లో నాశన మవుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (భారత్లో మూడో మరణం )

మరిన్ని వార్తలు