పెరుగుతున్న కరోనా కేసులు!

16 Mar, 2020 10:25 IST|Sakshi

సాక్షి, వరంగల్‌(ఎంజీఎం): వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం హన్మకొండకు చెందిన మరో వ్యక్తి 20 రోజుల క్రితం అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. అతడికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో చికిత్స కోసం మధ్యాహ్నం రెండు గంంటల సమయంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పరీక్షించిన కోవిడ్‌ విభాగం ప్రత్యేక వైద్యబృందం ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇదిలా ఉండగా.. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన మరో వ్యక్తి చికిత్స పొందకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఎంజీఎం వైద్యులు జిల్లా వైదారోగ్యశాఖ పరిధిలోని సర్వెలెన్స్‌ విభాగానికి చేరవేయగా.. వారు స్పందించి అతడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు.. ఏక్కడ నివాసముంటున్నాడు.. అనే వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఐదో అనుమానిత కేసు నమోదు
వారం రోజుల క్రితం ఇటలీ నుంచి వరంగల్‌ నగరానికి వచ్చిన విద్యార్థికి మొదటి కరోనా అనుమానిత కేసు నమోదు కాగా.. అతడిని ఎంజీఎం వైద్యులు ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించి గాంధీలో చికిత్స అందించారు. అలాగే హన్మకొండకు చెందిన మరో ఇద్దరు దంపతులతో పాటు అమెరికా వెళ్లి వచ్చిన నిట్‌ విద్యార్థి సైతం కరోనా లక్షణాలతో ఎంజీఎంలో అడ్మిట్‌ అయి చికిత్స పొందారు. వీరి బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా కరోనా నెగిటివ్‌ రావడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఐదో అనుమానిత కేసు ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. 

మరిన్ని వార్తలు