వరంగల్‌: కరోనా కలకలం..! 

7 Mar, 2020 11:09 IST|Sakshi

సాక్షి, జనగామ/లింగాలఘణపురం: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో కరోనా వైరస్‌ సోకిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. జనగామ జిల్లాలోని ఓ యువకుడు మూడు రోజుల క్రితం దుబాయి నుంచి రాగా.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో శుక్రవారం జనగామ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చాడు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనుమానంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించేందుకు నిర్ణయించారు. ఇంతలోనే సదరు యువకుడు ఇంటికి వెళ్లిపోగా.. జిల్లా అధికారులు, వైద్య బృందం వెళ్లి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయమై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఓ యువకుడు విదేశాల నుంచి రావడం, జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానంతో గాంధీ ఆస్పత్రికి పంపించామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

వరంగల్‌లో మరొకరు..
ఎంజీఎం: వరంగల్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి(24) ఈనెల 4న ఇటలీ నుంచి వచ్చాడు. అస్వస్థతకు గురికావడంతో గురువారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. సదరు వ్యక్తి తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన వైద్యులు చికిత్స చేసిన అనంతరం కరోనా వైద్య పరీక్ష నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్‌లో అదే రోజు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న వైద్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు