7 దేశాలతో హైరిస్క్‌

14 Mar, 2020 03:01 IST|Sakshi

అక్కడి నుంచి వచ్చే వారంతా ప్రత్యేక ఐసోలేషన్‌కు తరలింపు

వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో ఏర్పాట్లు

14 రోజులపాటు నిరంతర వైద్య పర్యవేక్షణ..

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కోవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్‌ వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఆ దేశాలను అత్యంత ప్రమాదకరమైన, హైరిస్క్‌ దేశాలుగా పరిగణిం చింది. ఆ ఏడు దేశాల నుంచి ఎవరొచ్చినా, వారికి కోవిడ్‌ లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచాలని శుక్రవారం నిర్ణయించింది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో తెలంగాణ టూరి జం ఆధ్వర్యంలో నడిచే హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్‌కు తరలించనుంది. 

ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అవసరమైన ఆహారం, ఇతర వసతులను సైతం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయనుం ది. వారిని 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యాక ఇళ్లకు పంపనుంది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే తక్షణమే గాంధీ లేదా ఇతర నిర్ణీత ప్రభుత్వ కోవిడ్‌ చికిత్స అందించే చోటుకు పంపనుంది. ఇప్పటికే ఏ దేశం నుంచైనా హైదరాబాద్‌ చేరుకున్న వారు 14 రోజులపాటు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం... ఈ ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రం నేరుగా తమ పర్యవేక్షణలోనే ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరిత రిసార్టును శుభ్రం చేయించి అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసింది. ఒకవేళ ఈ దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగినా, ఇతర దేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలున్నా వారిని ఐసొలేషన్‌లో ఉంచే విషయంలో సర్కారు అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. 

దూలపల్లిలోని ఫారెస్ట్‌ అకాడమీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థలనూ ఐసొలేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేయాలని భావిస్తోంది. మరీ అవసరమైతే ఇప్పటికే పూర్తయిన దాదాపు 40 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లను కూడా వాడుకొనేలా ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కాగా, శుక్రవారమే 17 మంది విమాన ప్రయాణికులను ప్రత్యేక వాహనంలో హరిత రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు అనంతగిరి ప్రాంతంలో ప్రత్యేక ఐసొలేషన్‌ ఏర్పాటుపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక కేంద్రమైన అనంతగిరిలో ఐసొలేషన్‌ కేంద్రం వల్ల స్థానికంగా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందంటూ పలువురు హరిత రిసార్ట్‌ వద్ద నిరసన చేపట్టారు.

కర్ణాటకవాసితో 34 మంది కాంటాక్ట్‌...
దేశంలో తొలి కోవిడ్‌ వైరస్‌ మృతుడు అయిన కర్ణాటకవాసితో మొత్తం 34 మంది అంతకుముందు సన్నిహితంగా మెలిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. ఆ వ్యక్తితో కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లోని ఆయా ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్‌ డ్రైవర్లు సహా మొత్తం 34 మంది కాంటాక్ట్‌ అయినట్లు తేల్చింది. ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో కర్ణాటక వాసికి కాసేపు ఐసీయూలోనూ చికిత్స అందింది. ఇంత జరిగినా, కోవిడ్‌ లక్షణాలున్నాయని గుర్తించినా చివరి వరకు వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 34 మందిలో గుర్తించిన 29 మందిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే వారిలో ఇద్దరికి కోవిడ్‌ అనుమానిత లక్షణాలున్నాయన్న భావనతో శాంపిళ్లను సేకరించి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు సమాచారం. దీనిపై వైద్య ఆరోగ్య వర్గాలు స్పష్టతనివ్వడంలేదు. ఇంకా ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే గాంధీ లేదా ఇతర కోవిడ్‌ అసోలేషన్‌ చికిత్స అందించే ఆసుపత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ వైరస్‌ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించాలని కొందరు వైద్యాధికారులు సూచించినట్లు తెలిసింది. కాగా, శుక్రవారం నాటికి హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 57,214 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు.

ఇతర రాష్ట్రాలకు బస్సుల నిలిపివేత!
హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నిలిపివేయాలని ఆర్టీసీకి వైద్య ఆరోగ్యశాఖ సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలకు వెళ్లే బస్సులను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని కోరినట్లు తెలియవచ్చింది. ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీ చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ఇతర రాష్ట్రాలకు నడపడంలేదు. మరోవైపు రైలు ప్రయాణాలు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. అత్యవసరమైతేనే వెళ్లాలని విజ్ఞప్తి చేస్తుంది. కర్ణాటక, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యల మాదిరిగా తెలంగాణలోనూ తీసుకునే అవకాశాలపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు నిపుణులతో చర్చిస్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశముంటే మరిన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక కీలకాధికారి తెలిపారు.

ఒక ప్రజాప్రతినిధి కుటుంబంలో ఇద్దరి శాంపిళ్ల సేకరణ...
ఇటీవల విదేశాల్లో పెళ్లికి వెళ్లొచ్చిన ఒక కీలక ప్రజాప్రతినిధి కుటుంబంలో ఇద్దరు సభ్యులకు విపరీతమైన జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన ఆ ప్రజాప్రతినిధి వైద్యాధికారులను సంప్రదించారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆ ఇద్దరి శాంపిళ్లను సేకరించి పరీక్షించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సుదూర ప్రయాణం, అక్కడి వాతావరణం కారణంగా సాధారణ జలుబుగానే వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. 

>
మరిన్ని వార్తలు