100కి డయల్‌ కరోనా!

16 Mar, 2020 03:24 IST|Sakshi

కోవిడ్‌ అనుమానితుల సమాచారమూ అందించవచ్చు

హాక్‌ ఐ ద్వారా కూడా తెలిపేందుకు అవకాశం

విదేశాల నుంచి వచ్చినవారు దాదాపు 750 మంది

వైద్య శాఖకు వివరాలు బదిలీ చేసిన హోంశాఖ.. 

సాక్షి, హైదరాబాద్‌: విపత్తులు, ఆపదల సమయంలో వెంటనే స్పందించే డయల్‌ 100 ఇప్పుడు మరో బాధ్యతను భుజాలకెత్తుకుంది. ఫైర్, రోడ్డు, అగ్నిప్రమాద ఘటనలతోపాటు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు తమ వంతుగా ముందు కొచ్చింది. రాష్ట్ర ప్రజల్లో కోవిడ్‌ వైరస్‌ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే తమ ఎమర్జెన్సీ నంబరు డయల్‌ 100 ద్వారా గానీ, హాక్‌ఐ ద్వారా గానీ తమకు సమాచారం అందజేయవచ్చని సూచించారు. అలాంటి కాల్స్‌ను రిసీవ్‌ చేసుకున్న డయల్‌ 100 కంట్రోల్‌ రూం వారు వెంటనే ఆ సమాచారాన్ని వైద్యారోగ్యశాఖకు బదిలీ చేస్తారని, వారు వచ్చి వెంటనే వైద్యసాయం అందజేస్తారని భరోసా ఇస్తోంది. 

పోలీసుల వద్ద విదేశీయుల జాబితా
కోవిడ్‌ కేసు వెలుగుచూసిన దరిమిలా.. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి అనుమానితులను ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తోంది. చైనా, హాంకాంగ్, సింగపూర్, ఇరాన్, థాయ్‌లాండ్, సౌత్‌ కొరియా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, నేపాల్, వియత్నాం, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ దేశాల నుంచి ఇంతవరకూ తెలంగాణకు 750 మంది రాష్ట్ర పౌరులు వచ్చారు. వీరందరి చిరునామాలు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని ఇటీవల వైద్యారోగ్యశాఖకు అందజేసింది. వారు ఏయే పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వస్తారో కూడా అందులో పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వైద్యారోగ్యశాఖ విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారిని సంప్రదించే యత్నాల్లో ఉంది. 

వదంతులపై చర్యలు.. అవగాహన షురూ!
కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ కూడా విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సోషల్‌మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని డీజీపీ కార్యాలయ అధికారులు హెచ్చ రించారు. అలాంటి వదంతులు పుట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కూడా హోంశాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే.  సైబరాబాద్, వరంగల్‌ కమిషనరేట్, కరోనాపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్‌ అనౌన్స్‌ మెంట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు: సజ్జనార్‌
శంషాబాద్‌: కోవిడ్‌ వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని సైబరా బాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టంచేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోని కోవిడ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఏవిధంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపడుతున్నారు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు