కామారెడ్డిలో కోవిడ్‌ కలకలం

4 Mar, 2020 02:18 IST|Sakshi

జ్వరం, తుమ్ములతో కామారెడ్డి 

ఆస్పత్రికి ఎల్లారెడ్డిపల్లి వాసి

వారం క్రితమే దుబాయ్‌ నుంచి రాక

కోవిడ్‌ లక్షణాలనే అనుమానంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేసిన వైద్యులు

కామారెడ్డి క్రైం/నిజామాబాద్‌ అర్బన్‌: హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసు నమోదైన మరుసటి రోజే రాష్ట్రంలో మరో కేసు కలకలం రేగింది. కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి జ్వరం, తుమ్ములతో వచ్చిన వ్యక్తిని కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేయడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కల్లోలం సృష్టించింది. ఇందల్‌వాయి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాల్‌రాజ్‌(40)  కొంతకాలం క్రితం దుబాయ్‌ వెళ్లాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. జ్వరం, తుమ్ములు ఎక్కువగా ఉండడంతో మంగళవారం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వచ్చాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

దీనిపై ఆ ఆస్పత్రిలోని ఛాతీవైద్య నిపుణుడైన డాక్టర్‌ను సంప్రదించగా.. జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, తలనొప్పితో బాధపడుతూ అతడు తమ వద్దకు వచ్చాడని తెలిపారు. దుబాయిలో ఉన్నప్పుడే అనారోగ్యం బారినపడినట్లు చెప్పాడని వెల్లడించారు. అతడికి కోవిడ్‌ వచ్చిందని కచ్చితంగా చెప్పలేమన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ఈ విషయమై కామారెడ్డి ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ చంద్రశేఖర్‌ను సంప్రదించగా.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సదరు ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడితో తాను మాట్లాడానని, పేషెంట్‌ పరిస్థితి ప్రకారం కోవిడ్‌ లక్షణాలు అంతగా కనిపించడం లేదన్నారు. నిజామాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం మాట్లాడుతూ.. దుబాయ్‌ నుంచి వచ్చిన తర్వాతే బాధితుడికి జలుబు, జర్వం వచ్చిందని అతడి కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. కాగా, రాత్రి 9.30 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లో బాల్‌రాజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.


   

మరిన్ని వార్తలు