కరోనా ఎఫెక్ట్‌: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

14 Mar, 2020 22:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత్‌లోను విజృంభిస్తున్న వేళ తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు ఈ భేటి జరిగింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కరోనాపై ప్రజలెవరు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో కేవలం 83 మందికే కరోనా లక్షణాలు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. 

ఇక తెలంగాణ వాసులెవరికీ కరోనా రాలేదని, కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విమానాశ్రయాలలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ఎంత ఖర్చునైనా పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టంచేశారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, విదేశాల నుంచి వచ్చే వారితోనే కరోనా వస్తుందన్నారు. కరోనా నిమిత్తం తక్షణమే రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకరికి కరోనా ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని, మరొకరికి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఆరోగ్యశాఖ సర్వసిద్దంగా ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌
‘మార్చి 31వ తేదీ వరకు జనసామర్థ్యం ఎక్కువ ఉండకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్స్‌ టూ యూనివర్సిటీ, కోచింగ్‌ సెంటర్లు మూసివేయాలని నిర్ణయించాం. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమింస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సెలవులు ఇవ్వకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌, కాలేజీ హాస్టల్స్‌ ఉంటున్న పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు వసతి ఉంటుంది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రత్యేక సానిటరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన పరీక్షలు కొనసాగుతాయి. 

మ్యారేజ్‌ హాల్స్‌ అన్ని మూసివేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నిర్ణయించబడ్డ పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. బంధువులను మాత్రం 200 లోపు ఉండేలా నియంత్రించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 31 తరువాత జరగబోయే పెళ్లిళ్లకు మాత్రం ఫంక్షన్‌ హాల్స్‌ బుకింగ్‌ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తాం.  వీటిని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చాం

రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగసభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్‌లకు అనుమతులను ఇవ్వడం లేదు. సినిమాహాల్స్‌, బార్లు, పబ్‌లు మూసివేస్తున్నాం. రాష్ట్రంలో జరగాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను రద్దు చేస్తున్నాం. ట్రేడ్‌ ఫేర్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌లకు అనుమతి ఇవ్వబడదు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ స్పోర్ట్స్‌ స్డేడియాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్‌లు, జూ పార్కులు, మ్యూజియమ్స్‌ మూసివేస్తున్నాం.  ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి’అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

చదవండి:
కరోనా ఎఫెక్ట్‌: గో మూత్రంతో విందు
అప్పుడే పుట్టిన శిశువుకి కరోనా లక్షణాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా