వెంట్రుక.. ఒత్తిడి తెలుస్తుందిక

21 May, 2019 01:21 IST|Sakshi

రక్త నమూనాలతో పోలిస్తే కచ్చితమైన ఫలితాలు

సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి

హైదరాబాద్‌: గోవుల్లో ఒత్తిడిస్థాయిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు పశువుల రక్తం, మూత్రం, మలాన్ని సేకరించి అందులోని హార్మోన్ల పెరుగుదల ఆధారంగా వాటి శారీరకఒత్తిడి తీవ్రతను గుర్తించే పద్ధతిని పాటిస్తుండగా తాజాగా గోవుల వెంట్రుకలను పరీక్షించడం ద్వారా ఒత్తిడిని కచ్చితంగా నిర్ధారించొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఉమాపతి, డాక్టర్‌ వినోద్‌కుమార్, హిమాచల్‌ప్రదేశ్‌ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ అరవింద్, ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని ప్రొఫెసర్‌ క్‌లైవ్‌ ఈ ప్రయోగాలు చేపట్టారు. దేశంలోని 54 గోశాలల్లో 11 ఏళ్ల వయసుగల 540 ఆవుల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగాలు జరిపారు. పశువుల శారీరక ఒత్తిడికి కారణమైన కాట్రిసోల్‌ హార్మోన్‌లు వాటి వెంట్రుకల్లో అధికంగా ఉన్నట్లు ఈ ప్రయోగాల్లో గుర్తించారు. 

ఒత్తిడికి కారణం జీవన పరిస్థితులే... 
పశువుల కొట్టాలు, గోశాలలు, ఇతర షెల్టర్లలో  పెంచే ఆవులు సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాటిలో విడుదలయ్యే హార్మోన్లు, ఒత్తిడికి గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్లను అనేకసార్లు పరిశీలించారు.  మైదాన ప్రాంతాల్లో ఉండే ఆవులను, షెడ్లలోని పశువుల పరిస్థితులతో పోల్చగా గోశాలల్లో ఉండే వాటిలోనే శారీరక ఒత్తిడి అధికంగా ఉం టోందని తేల్చారు. షెడ్లలో పడుకునేందుకు నేల సరిగా లేకపోవడం,   పరిశుభ్రంగా ఉంచకపోవడం, తక్కువస్థలంలో ఎక్కువ పశువులను పెట్టడం, అధిక వయసు వంటి సమస్యల వల్ల గోవుల్లో కాట్రిసోల్‌ హార్మ న్‌ అధికంగా విడుదలై అవి ఎక్కువ ఒత్తిడికి గురవుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో కనుగొన్నారు. దేశంలో పశుసంపదను కాపాడాలంటే పశువుల పెంపకం, వాటి రక్షణ విషయంలో మార్పులు జరగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, మంచి వాతావరణం, శాస్త్రీయ పద్ధతులు పాటించి షెడ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. 

మరిన్ని వార్తలు