10 డేస్‌.. బీ అలర్ట్‌

8 Apr, 2020 10:02 IST|Sakshi

నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘ వచ్చే పది రోజులు ఎంతో కీలకమైనవి. ప్రజలంతా మరింత అప్రమత్తంగా...క్రమశిక్షణతో మెలగాలి. లేకుంటే కరోనా విజృంభిస్తుంది.’ అని సీపీ అంజనీకుమార్‌ నగర ప్రజలను హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే...‘కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి. హోమ్‌ క్వారంటైన్‌ అయిన వాళ్లు ఇళ్లు దాటి బయటకు రాకూడదు. అత్యవసరం అయితేనో, నిత్యావసర సరుకుల కోసమో మాత్రమే బయటకు రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రజల నుంచి పూర్తి సహకారం అవసరం. మంగళవారం ఆరేడు పోలీసుస్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాలను నేను సందర్శించా.

97 శాతం వరకు లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. మరికొంత మెరుగు పడితే ఉత్తమం. రానున్న రోజుల్లో 100 శాతం అమలు కావాలి. ప్రతి గంటకూ సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షణ సాగుతోంది. ఇందులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు నిర్దేశిస్తున్నారు. ప్రభుత్వంతో సహా అన్ని విభాగాలు సమన్వయంతో, పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు కావాలి. ఇంకా ఒకటి రెండు శాతం ప్రజలు బయటకు వస్తున్నారు. రానున్న 10–15 రోజుల్లో ఎవరికి వారు స్వయం క్రమశిక్షణతో మెలగాల్సి ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయి. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. 104, 100, కోవిడ్‌ కంట్రోల్, స్థానిక పోలీసులు వీరిలో ఎవరికి కాల్‌  చేసినా తక్షణం స్పందించి సహాయం అందిస్తారు.’

మరిన్ని వార్తలు