టీచర్స్‌ మీట్‌ మిస్‌కావద్దు

25 Sep, 2019 11:42 IST|Sakshi

వలంటీర్లతో సంబంధాలుకొనసాగించండి

సిబ్బందికి పిలుపునిచ్చిన పోలీసు కమిషనర్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం మరో ఆడియో సందేశం విడుదల చేశారు. ఈసారి తమ చిన్నారులపై శ్రద్ధ తీసుకోవాలంటూ సిబ్బందికి హితవు పలికిన ఆయన.. గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించిన వలంటీర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ‘గణేష్‌ నవరాత్రి, నిమజ్జనాన్ని సమర్థమంతంగా నిర్వహించిన సిటీ పోలీసుల్ని అభినందిస్తున్నా. ఈ నేపథ్యంలోనే జోన్ల వారీగా బడా ఖానా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మూడింటిలో పూర్తయింది. అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారులు కలుసుకునే అవకాశం వీటి వల్ల కలుగుతుంది. ఇటీవల నాతో మాట్లాడి వివిధ స్కూళ్ల ప్రిన్సిపల్స్‌ చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేసింది. తాము క్రమం తప్పకుండా పేరెంట్‌–టీచర్‌ మీట్స్‌ ఏర్పాటు చేస్తామని, అయితే, పోలీసు పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఈ కార్యక్రమాలకు రావట్లేదని ఆ ప్రిన్సిపల్స్‌ చెప్పుకొచ్చారు.

ఇది సరైంది కాదని నేను భావిస్తున్నా. మీ పిల్లలు, కుటుంబం కోసం కాకపోయినా మనందని బంగారు భవిష్యత్‌ కోసం ప్రతి పోలీసు ఈ మీట్స్‌కు వెళ్ళాలి. వీలున్నంత వరకు భార్యభర్తలు ఇద్దరూ వెళితే ఉత్తమం. అలా కానప్పుడు కనీసం మీ భార్యనైనా పంపండి. ఉపాధ్యాయుల్ని కలిసి మాట్లాడటం వల్ల మీ చిన్నారుల వ్యవహారశైలి, వారి ప్రతిభాపాటవాలు, లోటుపాట్లు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం దొరుకుతుంది. తల్లిదండ్రులకు కుదరకపోతే కనీసం గార్డియన్‌ని అయినా పంపండి. ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో పోలీసు వలంటీర్లు చేసిన సేవ అనిర్వచనీయమైంది. పోలీసుకు పోటీగా అద్భుతంగా పనిచేశారు. అలాంటి దాదాపు రెండు వేల మంది వలంటీర్ల జాబితా ప్రస్తుతం మన వద్ద ఉంది. వారితో సంబంధాన్ని కొనసాగించండి. తరచుగా ఠాణాలకు పిలిచి వారితో కాసేపు కూర్చుని టీ తాగండి. మీరు వారి ప్రాంతాలకు వెళ్ళి కలుసుకోండి. తద్వారా వారూ మనలోని భాగమే అని భావన కలిగించండి. వలంటీర్లతో ఈ బంధం శాశ్వతం కావాలి. ఈ క్రతువులో బ్లూకోల్ట్సŠ, పెట్రోల్‌ కార్స్‌ సిబ్బంది పాత్ర చాలా కీలకం. వారంలో కనీసం ఒక్కసారైనా వలంటీర్లతో కార్యక్రమం నిర్వహించడం లేదా కలవడం చేయండి. ఈ అంశంపై ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు దృష్టి పెట్టాలి. నగర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి’ అని అంజనీకుమార్‌ కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా