‘నా ఆటో సేఫ్‌’ అనే భావన కలిగించాలి

13 Feb, 2019 10:10 IST|Sakshi
స్టిక్కర్‌ను పరిశీలిస్తున్న సీపీ

రసూల్‌పురా: నగర ప్రజలకు ఆటోలో ప్రయాణించడం ద్వారా భద్రత ఉంటుందనే భావన కల్పించేందుకు ప్రతి ఆటో డ్రైవర్‌ కృషి చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. నార్త్‌జోన్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం కంటోన్మెంట్‌ టివోలీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. ఆటో డ్రైవర్లు మోసాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే క్యూకోడ్‌ ద్వారా తక్షణపై పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో 90 వేల ఆటోలు ‘మై ఆటో ఈజ్‌ సేఫ్‌’ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ ఆటోలలో ప్రయాణికులు ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేయవచ్చునన్నారు.  క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని నగరంలోని ప్రతి ఆటోకు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీసుల సహాయం అవసరమైతే 100 నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. 100 వంద మంది కానిస్టేబుళ్లు నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నారని, ప్రతి రోజూ 4వందల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అదనపు కమిషనర్‌ షికా గోయల్‌ మాట్లాడుతూ నగరంలో కొందరు ఆటో డ్రైవర్ల వేషభాషల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆటోల్లో ప్రయాణించాలంటే మహిళలు అభద్రతకు లోనవుతున్నారని, వాటిని పోగోట్టే బాధ్యత ఆటో డ్రై వర్లదే అన్నారు. సురక్షిత నగరమే కాకుండా సురక్షితంగా ప్రయాణించగలమనే నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు కమిషనర్‌ చౌహాన్, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ‘మైఆటో ఈజ్‌ సేఫ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వెయ్యి మంది డ్రై వర్లు రిజిస్టేషన్‌ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఆటోకు వెనుక, ముందు   స్టిక్కర్, డ్రై వర్‌ సీటు వెనుక భాగంలో యూవీ ప్రింటెడ్‌ మెటల్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని వల్ల ఆటో ఓనర్‌ పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

మరిన్ని వార్తలు