‘హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది.. దయచేసి’

7 Mar, 2020 14:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ ఐటీ కంపెనీల సీఈవోలు, హైసియా మెంబర్స్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కరోనాపై సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల ఐటీ కారిడార్‌లో రెండు రోజుల క్రితం ఏర్పడిన భయాందోళన పరిస్థితి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ఎవరూ సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేయవద్దని, కరోనాపై ఏవైనా అపోహలుంటే సైబరాబాద్‌ పోలీసులను సంప్రదించాలని సూచించారు. (వరంగల్‌: కరోనా కలకలం..! )

మైండ్‌ స్పేస్‌లో ఓ ఐటీ కంపెనీ ఉద్యోగినికి కరోనా సోకిందన్న వదంతులు వచ్చాయని, కానీ ఆమెకు నెగిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని, ఇలాంటి వదంతులు వల్ల ఆ పేరు పోతుందన్నారు. నగరంలో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతుల వల్ల వారంతా కంగారు పడుతున్నారని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లో సైబరాబాద్‌ పోలీసులు, హైసియా, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యురిటీ కౌన్సిల్‌, ఐటీ కంపెనీలతో కలిసి కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల కోసం గాంధీ ఆస్పత్రితోపాటు 40 ప్రైవేట్‌ ఆసుపత్రులలోకూడా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
(కోవిడ్‌-19: వ్యాక్సిన్‌ రెడీ.. క్లినికల్‌ ట్రయల్స్‌!)


 

మరిన్ని వార్తలు