సీపీఐ, సీపీఎం సహకరించుకోవాలి

23 Mar, 2019 03:18 IST|Sakshi

మిగతాచోట్ల మద్దతు ఎవరికన్న దానిపై రాష్ట్ర కమిటీదే నిర్ణయం 

సీపీఐ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీచేసే స్థానాల్లో పరస్పరం సహకరించుకుని, పూర్తిస్థాయిలో మద్దతు అందించుకోవాలని సీపీఐ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఈ రెండు పార్టీలు పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. వామపక్షాలు పోటీచేయని చోట్ల టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు బలమైన లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు, అభ్యర్థులకు మద్దతునివ్వాలని సూచించింది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీచేయని సీట్లలో ఎవరికి మద్దతు తెలపాలనే విషయంలో ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో రాష్ట్ర కమిటీకి సీపీఐ జాతీయకార్యదర్శివర్గం సూచనలు చేస్తూ ఒక లేఖను పంపినట్టు సమాచారం.

ఈ ఎన్నికల్లో చెరో రెండుస్థానాల్లో పోటీ చేయడంతోపాటు పరస్పరం సహకరించుకుని మిగతాసీట్లలో టీఆర్‌ఎస్, బీజేపీల ఓటమికిగాను బలమైన లౌకిక, ప్రజాతంత్రశక్తులను బలపరిచే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ సీపీఐ షరతు విధించడం పట్ల సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. సీపీఐ, సీపీఎం అభ్యర్థులు పోటీచేయని మిగతా 13 సీట్లలో జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ(యూ), బీఎల్‌పీ, ఎంబీటీ వంటి పార్టీలకు మద్దతునివ్వాలని సీపీఎం చేసిన సూచనను సీపీఐ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో పొత్తులపై తేల్చాలంటూ ఇరుపార్టీలు జాతీయ నాయకత్వాలను ఆశ్రయించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం వేర్వేరుగా పోటీ చేయడంతో పాటు, ఇతర స్థానాల్లో మద్దతునిచ్చే విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోనున్నాయి.  

ఏచూరితో రాష్ట్ర కమిటీ భేటీ... 
ఖమ్మం లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థి బి.వెంకట్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో సీపీఐతో చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి ఏచూరికి వివరించారు. వామపక్షాలు పోటీచేయని చోట్ల  సీపీఐ షరతుపై ఆ పార్టీ జాతీయనాయకత్వం తో మాట్లాడి స్పష్టతనివ్వాలని ఏచూరిని రాష్ట్ర నాయకులు కోరారు. ఈ సందర్భంగా పార్టీ పోటీచేస్తున్న ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

మరిన్ని వార్తలు