‘కేసీఆర్ కొత్త బస్సులు ఎందుకు కొనలేదు’

3 Nov, 2019 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం లేదని.. ఆర్టీసీ కార్మికుల సమస్యల తరపున పోరాటం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 45 వేల మంది బతుకులను పణంగా పెట్టి సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్.. కొత్త బస్సులు ఎందుకు కొనలేకపోయారని ప్రశ్నించారు.

సీఎం కార్మికులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ ఎటు పోయిందో తెలియదు.. మళ్లీ అవకాశం ఇస్తున్నా అనే మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా కర్కశంగా తయారయ్యారని ఆరోపించారు. కేబినెట్‌లో కేసీఆర్‌కి ఎదురుచెప్పే మంత్రులు లేరని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే దానిపై మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేసినప్పుడు ఇక్కడ చేసేందుకు ఇబ్బందులు ఏంటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని చాడ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు