రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి

5 May, 2020 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలు తదితర రంగాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత ప్రజలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. బాధిత వర్గాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ నాయకులు సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. మఖ్దూంభవన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 దాకా దీక్షలో పాల్గొన్న పార్టీ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, డా.కె.నారాయణ, అజీజ్‌పాషా, పశ్యపద్మ, ఎన్‌.బాలమల్లేష్, డా. సుధాకర్‌లకు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఇక జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ రాష్ట్రనాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు తమ తమ ఇళ్లలోనే దీక్షల్లో పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షలో రాష్ట్రంలో వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, చేతి వృత్తిదారులకు ప్రభుత్వం రూ. 7 వేలు చొప్పున ఆర్థిక సాయం, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలని, తెల్లకార్డులు లేని అర్హులను, పేదలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ వైద్య, విద్యాసంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇప్పించాలని, వరి కొనుగోలు క్వింటాకు 5 కిలోల తరుగు విధానంపై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. (తెలంగాణ: అటు కేబినెట్‌ భేటీ, ఇటు దీక్షలు)

మరిన్ని వార్తలు