ఆర్టీసీ డిమాండ్లపై కమిటీ వేయాలి

30 Oct, 2019 03:48 IST|Sakshi
‘చలో డీజీపీ ఆఫీసు’ కార్యక్రమంలో పాల్గొన్న చాడ వెంకట్‌రెడ్డి, నారాయణ తదితరులు

సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పరిష్కారం కాని డిమాండ్లు, అంశాలపై ప్రభుత్వపరంగా కమిటీని వేసి పరిశీలించాలని సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావంతో పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు తన నిరవధిక దీక్షను కొనసాగించనున్నట్లు వెల్లడించారు. సీఎంగా తాను ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన రాజ్యాంగంపై కేసీఆర్‌కు గౌరవముంటే చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో నాలుగవ రోజు దీక్షను కొనసాగిస్తున్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ హైకోర్టు చేసిన సూచనలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి సమ్మె ద్వారా ఏర్పడిన ప్రతిష్టంభనను దూరం చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటీకరించి ఆస్తులను కాజేసేందుకు జరుగుతున్న కుట్ర, రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పారు.
  
పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు 

కూనంనేని అరెస్ట్‌ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మంగళవారం డీజీపీకి సీపీఐ నాయకులు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహా తదితరులు ఫిర్యాదు చేశారు. కూనంనేనిని అరెస్ట్‌ చేసినపుడు చొక్కా వేసుకునేందుకు, కళ్లజోడు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా, ఆయనతో పాటు రిలే దీక్షలు చేస్తు న్న 13 మందిని కూడా పోలీసులు ఈడ్చుకుపోయారని తెలిపారు. ఆ విధంగా జరిగి ఉంటే సరికాదని, పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన సమాచారం పరిశీలిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారని చాడ వివరించారు.
    
కూనంనేనికి సీపీఎం నేతల పరామర్శ 
నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామ్యహక్కును ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, బి.వెంకట్‌ విమర్శించారు. మంగళవారం నిమ్స్‌ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేనిని సీపీఎం నాయకులు పరామర్శించారు. ఆర్టీసీ సమస్యలపై కార్మికులు సమ్మె చేపట్టి 25 రోజులు పూర్తయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా