‘ఆగస్టు 15ను తెలంగాణ వ్యాప్తంగా బ్లాక్‌ డేగా పాటించాలి’

9 Aug, 2019 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికరణాలైన ఆర్టికల్‌ 370, 35 ఏ లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటాన్ని, కశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, ఆగస్టు 15ను ‘‘బ్లాక్‌ డే’’గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు నిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సంఘ్‌ పరివార్‌ బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదుల బీజేపీ ప్రభుత్వం తమ పథకంలో భాగంగానే కొద్ది రోజుల ముందు నుండే ఆర్టికల్స్‌ 370, 35 ఏ లను రద్దు చేయటానికి ముందు కశ్మీర్‌ లోయను దిగ్భంధం చేశారని తెలిపింది. కేంద్ర హెం శాఖ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన జాతీయ సలహాదారు అజిత్‌ ధోవల్‌, హెం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారని పేర్కొంది. ఉగ్రవాదుల దాడి ముప్పు ఉన్నదనే పేరుతో భారీ స్థాయిలో కశ్మీర్‌లో సైన్యాన్ని మోహరించి 144 సెక్షన్‌లు అమలు చేస్తూ, ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్స్‌ నిషేదించి ప్రజలను బయట ప్రపంచంతో దూరం చేశారని వెల్లడించింది. అమర్‌నాథ్‌ యాత్రికులను, విద్యాలయాలను మూసివేసి విద్యార్థులను కశ్మీర్‌ నుంచి వెనక్కు పంపడం మెదలుపెట్టారని, మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భంధంలోకి తీసుకున్నారని తెలిపింది.

ఆ తర్వాతనే రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారని, భారత్‌ -పాకిస్తాన్‌ సరిహద్దులో బలగాలను మోహరించారని పేర్కొంది. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు, ముస్లిం ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌, భద్రతాసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్‌లో చట్టాలను మార్చవచ్చును కాని ఏకపక్షంగా చట్టాల్లో మార్పులు చేసే అధికారం భారత ప్రభుత్వానికి లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో 370,35ఏ ఆర్టికల్‌లను రద్దుచేయటాన్ని తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు, వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు జరుపుకోవటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మైనార్టీలు , దళితులు, ఆదివాసులు, అన్ని సెక్షన్ల ప్రజలు, వామపక్షాలు, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి సంస్థలు, వ్యక్తులు పార్లమెంటులో ఆమోదించి రద్దు చేసిన ఆర్టికల్‌లను పునరుద్ధరించే వరకు పోరాడాలని కోరింది. 370, 35 ఏ రద్దుకు నిరసనగా ఆగస్టు 15ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘బ్లాక్‌ డే’’గా పాటించాలని మరో సారి పిలుపునిచ్చింది. 

>
మరిన్ని వార్తలు