పద్ధతి మార్చుకోకపోతే.. చర్యలు..

8 Feb, 2020 08:47 IST|Sakshi

సాక్షి, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన అమాయకులైన ఆదివాసీ వలస కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భద్రాచలానికి చెందిన కొందరు.. ఏజెంట్లుగా అవతారమెత్తి వారి శ్రమను డబ్బు రూపంలో దోచుకుంటున్నారని సీపీఐ (మావోయిస్టు) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ జోనల్‌ సెక్రటరీ గణేశ్‌ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. సదరు ఏజెంట్లు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం భద్రాచలంలోని పత్రిక కార్యాలయాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖలను కవర్‌లో పెట్టి విడిచి వెళ్లారు. 

లేఖలోని సారాంశం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు పని కల్పిస్తామని వలస కార్మికులుగా మార్చి భద్రాచలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏజెంట్లుగా మారారని, ఈ ఆదివాసీలను పనులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వారి శ్రమను పెట్టుబడిగా మార్చుకొని ఈ ఐదుగురు వ్యక్తులు భద్రాచలంలో తమ ఆస్తులను విపరీతంగా పెంచుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలిపారు. అమాయక ఆదివాసీలకు కూలీ పనులు చూపెడతామంటూ ఇక్కడకి రప్పించి, వారిని పలు పనులకు గుండుగుత్తగా అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆదివాసీలకు భాష రాకపోవడం, కూలీ పనులకు ఎంత సొమ్ము చెల్లిస్తారో తెలియకపోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు పనికల్పించే వారితో కుమ్మక్కై వారికి చెల్లించే కూలీ సొమ్మును కూడా ఏజెంట్లే తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. 

కొన్ని సమయాల్లో కూలీ డబ్బులు అడిగితే ఈ ఆదివాసీ కూలీలను పశువుల కన్నా హీనంగా కొట్టి హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఐదుగురు ఏజెంట్ల ఇంటి ఆవరణలో ఉన్న షెడ్లలో బంధించి సగం డబ్బులే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు రూ.కోట్లతో భవంతులు నిర్మించుకుంటున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు