రఫేల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి

13 Feb, 2019 02:30 IST|Sakshi

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రఫేల్‌ రక్షణ ఒప్పందంతో ముడిపడిన అన్ని అంశాలతో వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఒప్పందంలోని అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. రఫేల్‌ ఒప్పందంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడంతో అనేక తప్పులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్‌.బాలమల్లేష్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పార్లమెంట్‌ సమయం వృథా అవుతోందంటూ రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ దబాయింపు కేకలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

జాతీయ పౌరసత్వ చట్టానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలను మొత్తంగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇది పూర్తిగా ఒక మతానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆ వర్గానికి తీరని అన్యాయం జరిగే పరిస్థితులున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ మొండి తనానికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దీనికి వ్యతిరేకంగా భారతరత్న అవార్డు తీసుకునేందుకు భూపేన్‌ హజారికా కుమారుడు నిరాకరించాడన్నా రు. ఇంతకు ముందే అస్సాం, మణిపూర్‌ ప్రాంతా లకు చెందిన మేధావులు తమకిచ్చిన పద్మశ్రీ అవార్డు లను తిరస్కరించారని గుర్తుచేశారు.  

ఇద్దరే అన్ని ఫైళ్లు చూస్తారా: చాడ 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్టు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. కేబినెట్‌లో 18 మంది మంత్రులు చూడాల్సిన ఫైళ్లను సీఎం, హోంమంత్రి ఇద్దరే ఎలా పరిశీలిస్తారని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు