12న సంగారెడ్డిలో మహాధర్నా: తమ్మినేని

7 Apr, 2016 18:44 IST|Sakshi
హత్నూర (మెదక్) : మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయనందుకు నిరసనగా ఈ నెల 12న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మహాధర్నా చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం మెతుకు సీమ కరువు యాత్రలో భాగంగా హత్నూర మండలంలో ఎండిపోయిన వరిపంటను పరిశీలించి, ఉపాధి కూలీలతో సమస్యలను సీపీఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో లక్షా 30వేల బడ్జెట్‌ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంత ప్రజలను ఆదుకోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు కోట్లాది రూపాయల బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు కాకుండా పాలకులు ప్రజల కష్టాలు పట్టించుకోవాలని హితవు పలికారు.
మరిన్ని వార్తలు