కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ

16 Oct, 2018 09:18 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పక్కన కంచె ఐలయ్య తదితరులు

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: సీఎం కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీచేస్తారని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు అంగీకరించారని టీమాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య వెల్లడించారు. ఈ విషయంలో గద్దర్‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీచేయకుండా తనకు సహకరించాలని కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సైలెన్‌ బాటిల్‌ సాయం తో చేసిన ఉద్యమం కంటే ప్రజాఉద్యమాల కోసం తన శరీరంలో బుల్లెట్లు ఉంచుకున్న గద్దర్‌ నిజమైన ఉద్యమ నాయకుడని అన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు అధికారం దక్కాలన్నదే బీఎల్‌ఎఫ్‌ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. అధికారంలోకి వస్తే రైతుబంధుకు అదనంగా కూలీ బంధుపథకం తీసుకొస్తామని హామీఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను పటిష్టపర్చి అందులో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రారంభిస్తామన్నారు.

చరమగీతం పాడాలి 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఉద్యమ ముసుగులో గద్దెనెక్కిన కేసీఆర్‌ నాలుగేళ్ల కాలంలో బంగారు తెలంగాణకు బదులుగా కుటుంబ పరిపాలనతో అప్రజాస్వామికంగా దరిద్రపు తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. సంస్కారం లేని, నీతిమాలిన తిట్ల పురాణంతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి పరిపాలనకు చరమగీతం పాడాలంటే బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.  నాగర్‌కర్నూల్‌లో దళిత కులానికి చెందిన శ్రీనివాస్‌ బహదూర్‌ను బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా ప్రకటించామని  గెలిపించాలని కోరారు. సమావేశంలో టీమాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ,  బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు గులాం, నాగర్‌కర్నూల్‌ శాసనసభ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ బహదూర్, స్థానిక బీఎల్‌ఎఫ్‌ నాయకులు వర్ధం పర్వతాలు, కందికొండ గీత, ఆర్‌.శ్రీనివాసులు, దేశ్యానాయక్, రామయ్య పాల్గొన్నారు.

రాజ్యాధికారంతోనే బడుగుల అభివృద్ధి 
కొల్లాపూర్‌: రాజ్యాధికారంతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం స్థానిక మహెబూబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీఎల్‌ఎఫ్‌ నియోజకవర్గ ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభకు తమ్మినేని వీరభద్రంతోపాటు టీమాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కొల్లాపూర్‌ నియోజకవర్గం కమ్యూనిస్టులకు పుట్టినిల్లు వంటిదని, ఈ కోటపై బీఎల్‌ఎఫ్‌ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అగ్రవర్ణాల పార్టీలుగా మారాయన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రకటించబోయే జాబితాలో కూడా బీసీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కేలా లేదన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే చదువుల సావిత్రి అనే పథకంతో ప్రతి అమ్మాయికి చదువుతోపాటు అన్ని రకాల సంక్షమే పథకాలను వర్తింపజేస్తామన్నారు. రైతుబంధుతోపాటు కూలీబంధు పథకాన్ని తీసుకొచ్చి రూ.లక్ష వరకు ఉపాధి రుణాలు ఇస్తామన్నారు. బీఎల్‌ఎఫ్‌ ప్రకటించిన 56 స్థానాల్లో 32 స్థానాలు బీసీలకే కేటాయించామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బ్రహ్మయ్యచారిని గెలిపించాలని ఆయన కోరారు.

కంచె ఐలయ్య మాట్లాడుతూ కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతులు పాలమూరు ప్రాజెక్టులో తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని, రైతుల పక్షాన బీఎల్‌ఎఫ్‌ నిలవాలని కోరుతూ తమ్మినేనికి వినతిపత్రం అందజేశారు. సదస్సులో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలజం సత్యనారాయణ, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాస్‌ బహద్దూర్, జయరాములు, నాయకులు జాన్‌వెస్లీ, కిల్లె గోపాల్, ఈశ్వర్, జబ్బార్, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు