టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాల్సిందే

29 Jul, 2018 12:07 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

నిజామాబాద్‌నాగారం: తెలంగాణ వచ్చాక కేసీఆ ర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులొచ్చాయి తప్ప ప్రజల బతుకులు మారలేదని టీమాస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ‘బహుజనుల రాజ్యాధికారం– ఓటర్‌ పాత్ర రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై జిల్లా కేంద్రంలోని లక్ష్మీకళ్యాణ మండపంలో టీమాస్‌ జిల్లా కన్వీనర్‌ పెద్ది వెంకట్రాములు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల బతుకులు మార్చలేని సీఎం కేసీఆర్‌ను మార్చాల ని పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారానికి ఓటే మార్గమని, వచ్చే ఎన్నికల్లో బహుజనుల బలం చూపించాలన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో పేదలకు న్యాయం జరగలేదని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు.

త్వరలో బహుజన క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్‌ నగరంలో భూ కబ్జాదారుల చెరలో ఉన్న భూములు కక్కిస్తామని, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే లా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. గుడిసెలు వేసుకొని పట్టాలు వచ్చే వరకు పేదల తరపున సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. బీఎల్‌ఎఫ్‌ను బలపరిచేందుకు ముందుకొచ్చే డ్వాక్రా సంఘాల మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 కేసీఆర్‌ను గద్దె దించడానికి ఓటే బలమైన ఆయుధమని, ఇది ఏకే–47 కంటే శక్తివంతమైందని టీమాస్‌ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు రాజు పేర్కొన్నారు.  వివిధ పార్టీలు, సంఘాల నేతలు ప్రభాకర్, దండివెంకట్, సాయిబాబా, ఉప్పు సంతోష్, భూపాల్, ప్రకాశ్, పాలడుగు భాస్కర్, రమేశ్‌బాబు, నూర్జహాన్, మాల్యాల గోవర్ధన్, సాజుద్దిన్, మార్టిన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు