నేటి నుంచే ‘ఎర్ర పండుగ’

18 Apr, 2018 01:54 IST|Sakshi

నగరంలో ఐదు రోజులు

సీపీఎం జాతీయ మహాసభలు

 చివరి రోజు 22న బహిరంగ సభ

 ఏచూరి, కారత్‌ సహా 846 మంది ప్రతినిధులు

 రాజకీయ విధానం, పార్టీ పటిష్టతపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ ఆర్టీసీ కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు. సీపీఎం రాజకీయ పంథాపైనా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తాము అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ తదితరాలపైనా చర్చ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాశ్‌కారత్, మాణిక్‌ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్రం నుంచి 35 మందితో సహా 846 మంది ప్రతినిధులు సభల్లో పాల్గొంటారు. 

షెడ్యూల్‌ ఇదే.... 

వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం పదింటికి ఆర్టీసీ కల్యాణమండపంలో ‘మహ్మద్‌ అమీన్‌ నగర్‌’ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్‌ నుంచి సభ జరిగే సరూర్‌నగర్‌ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్‌ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. మంగళవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశమై మహాసభల ఎజెండాను ఆమోదించాయి. 

రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చిస్తాం 
‘‘పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం, రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చ జరుగుతాయి. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండవు. తెలంగాణలో బీఎల్‌ఎఫ్‌ బలోపేతంపై చర్చిస్తాం. మహాసభలకు సర్వం సిద్ధం చేశాం.’ 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం   

మరిన్ని వార్తలు