పోటీకి ‘ఫ్రంట్‌’

12 Aug, 2018 14:17 IST|Sakshi
ప్రజా సమస్యలపై  కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులు (ఫైల్‌) 

గతంలో ఒంటరిగా లేదా ప్రధాన పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే సొంత కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరిట ఇప్పటికే ప్రజా సంఘాలు, చిన్నా చితకా పార్టీలతో జట్టు కట్టిన సీపీఎం, ఎన్నికల నాటికి భావసారూప్య పార్టీలకు చేరువ కావాలని భావిస్తోంది. పార్టీ పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతమవుతూనే, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనుంది. పార్టీ అనుబంధ ప్రజా సంఘాల సభ్యులను ఓటు బ్యాంకుగా మా ర్చుకోవాలనే వ్యూహంతో పనిచేస్తోంది. అదే సమయంలో ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను ఎన్నికల నాటికి బీఎల్‌ఎఫ్‌ గొడు గు కిందకు తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.    
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఎం) వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది. గతంలో మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో కలిసి ప్రధాన రాజకీయ పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే ఎన్నికల్లో సొంతంగా ఏర్పాటు చేసే రాజకీయ కూటమికి నేతృత్వం వహించాలని నిర్ణయించింది. సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు మిత్ర పక్షం సీపీఐ.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమితో జట్టు కట్టే అవకాశం ఉందని సీపీఎం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐతో సంబంధం లేకుండా వివిధ ప్రజా సంఘాలు, భావ స్వారూప్యత కలిగిన చిన్నా, చితకా పార్టీలతో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించింది.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పేరిట ఇప్పటికే జిల్లాలో ఎంసీపీఐ, మహాజన సమాజ్‌పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, మజ్లీస్‌ బచావో తహరీక్‌ (ఎంబీటీ) తదితర పార్టీలతో కలిసి పనిచేస్తోంది. వీటితో పాటు అంబేడ్కర్‌ భావజాల సంఘాలు, పలు ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు కూడా బీఎల్‌ఎఫ్‌లో భాగస్వామిగా ఉన్నాయి. ఎన్నికల నాటికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయాలని భావిస్తోంది. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితితో కూడా రాజకీయ అవగాహన కోసం మంతనాలు జరుపుతోంది.

మూడు స్థానాలపై ప్రత్యేక దృష్టి
బీఎల్‌ఎఫ్‌ పక్షాన పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాలతో పాటు, అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను నిలపనుంది. పార్టీ పరంగా మాత్రం కేవలం మూడు అసెంబ్లీ స్థానాలపైనే దష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావిస్తోంది. సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా కొంత బలంగా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సంగారెడ్డి, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని భారీ, మధ్య తరహా పరిశ్రమల ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మిక విభాగం సీఐటీయూ వరుస విజయాలు సాధిస్తోంది.

పార్టీ అనుబంధ సంఘాలు సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం తదితరాల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరంగా సుమారు 1.50లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల నాటికి అనుబంధ సంఘాల సభ్యుల ఓట్లను పార్టీ ఓటు బ్యాంకు మార్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా లేని బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను బరిలోకి దించాలనేది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 350 గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. మండల, నియోజకవర్గాల కమిటీల నిర్మాణంపై కసరత్తు చేస్తోంది.

అసంతృప్తులపైనా వల
ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలు సీపీఎంలో ఇమడలేరనే భావనను తొలగించాలని సీపీఎం భావిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో రాజకీయ అవకాశం దక్కని అసంతృప్త నేతలను ఎన్నికల నాటికి బీఎల్‌ఎఫ్‌ కూటమి గొడుగు కిందికి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం మంతనాలు సాగిస్తోంది.

పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలో ప్రధాన పార్టీలకు చెందిన ఎనిమిది మంది ముఖ్య నేతలు, టికెట్‌ దక్కని పక్షంలో బీఎల్‌ఎఫ్‌ తరపున పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు సీపీఎం లెక్కలు వేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఎన్నికల నాటికి రాజకీయ వేడిని పెంచేందుకు పార్టీ పరంగా, బీఎల్‌ఎఫ్‌ ద్వారా ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సీపీఎం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రయత్నమని పార్టీ ముఖ్య నేత ఒకరు చేసిన వ్యాఖ్య పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది.
 

మరిన్ని వార్తలు