సైన్స్‌ఫెయిర్లతో సృజనాత్మకత

25 Aug, 2014 01:10 IST|Sakshi

తాండూరు టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇన్‌స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు. ఆది వారం ఆయన పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇన్‌స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వచ్చే నెల 11 వరకు నాలుగు చోట్ల సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నామన్నారు.

 ఈ నెల 25 నుంచి 27వరకు తాండూరులో, 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు పరిగిలో, సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఇబ్రహీంపట్నంలో, 9 నుంచి 11 వరకు కుత్బుల్లాపూర్‌లలో సైన్స్‌ఫెయిర్లు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. సైన్స్‌ఫెయిర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,34,35,500 వెచ్చిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో ఒక్కో నమూనా తయారీకి ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున రూ.1,03,35,000, 3 రోజుల పాటు జరగనున్న సైన్స్‌ఫెయిర్ సందర్భంగా భోజనం తదితర వసతుల కల్పనకు ఒక్కో విద్యార్థికి రూ.1500 చొప్పున మొత్తం రూ. 31,00,500 ఖర్చు చేయనున్నట్లు రమేష్ చెప్పారు.

జిల్లావ్యాప్తంగా 2,067 నమూనాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. సైన్స్‌ఫెయిర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నమూనాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 500 నమూనాల ప్రదర్శనకు సిద్ధం చేశామని డీఈఓ తెలిపారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో ఒక్కో దాని నుంచి 7.5 శాతం చొప్పున నమూనాలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ 5 శాతం ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారన్నారు. రాష్ట్రస్థాయిలో వచ్చే నెల చివరి వారంలో సైన్స్‌ఫెయిర్ జరుగుతుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని తాండూరులో సోమవారం జరగనున్న సైన్స్‌ఫెయిర్‌లో 382 నమూనాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.  

 అనుమతి లేని పాఠశాలలు 15 రోజుల్లో సీజ్
 అనుమతి లేని పాఠశాలలకు ఇచ్చిన 2 నెలల గడువు మరో 15 రోజుల్లో ముగిసిపోతుందని డీఈఓ రమేష్ గుర్తు చేశారు. అనంతరం ఆయా పాఠశాలలను సీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు డీజీ, టాలెంట్, కాన్సెప్ట్, గ్రామర్, టెక్నో వంటి పేర్లను తొలగించాలంటూ నోటీసులు జారీ చేయనున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ కింద రూ.50 వేలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఎస్జీటీ, ఎస్‌ఏ కలిపి సుమారు 100 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

 ఉపాధ్యాయులు విధిగా పాఠ్యప్రణాళిక, డైరీలను రాయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులు వారికి కేటాయించిన 27 సెలవులను యథావిధిగా వినియోగించుకోవచ్చన్నారు. ఎన్‌ఐఆర్‌డీ అధికారులు పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్య తదితర అంశాలపై 12 మంది టీం సభ్యులుగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు