నేర పరిశోధనలో ‘నేను సైతం’

7 Aug, 2018 02:30 IST|Sakshi
రికవరీ చేసిన డబ్బును చూపుతున్న డీసీపీ సుమతి

  30 లక్షల నగదు బ్యాగు పోగొట్టుకున్న తల్లీకుమార్తె 

  24 గంటల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 

  కీలకంగా మారిన ‘నేను సైతం’ సీసీ కెమెరాలు 

  నిందితుడు చిక్కడానికి నాలుగు రోజుల సమయం 

  రూ. 28.4 లక్షలు స్వాధీనం 

హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ తల్లీకుమార్తె రూ.30 లక్షలతో గత బుధవారం విజయవాడకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆటోలో రైల్వేస్టేషన్‌కు వస్తుండగా నగదు బ్యాగు ‘మాయమైంది’. దర్యాప్తు చేసిన గోపాలపురం పోలీసులు గురువారం ఉదయానికే ఆ బ్యాగు జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్‌ వద్దకు ‘చేరినట్లు’ గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని సోమవారం అదుపులోకి తీసుకుని రూ.28.4 లక్షలు రికవరీ చేశారు. ‘నేను సైతం’ప్రాజెక్ట్‌ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఇది సాధ్యమైందని నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.  

నగదుతో ఉన్న బ్యాగు మాయం... 
విజయవాడకు చెందిన సుశీల తల్లి (102) నల్లకుంటలో మనుమరాలు భాగవతుల మోహిని (50) వద్ద ఉండేది. ఈమె ఇటీవల మరణించడంతో సుశీల నగరానికి వచ్చారు. ఇక్కడ పనులు ముగించుకుని గత బుధవారం తిరుగు ప్రయాణమ య్యా రు. విజయవాడలో కుమారుడికి ఇవ్వడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసుకున్నారు. ఐదు బ్యాగులతో మోహిని, సుశీల ఆటోలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్‌కు చేరుకున్నాక చూస్తే నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. అదే ఆటోలో వెనక్కు వెళ్లి గాలించినా ఫలితం లేకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

క్రాస్‌రోడ్స్‌లో పడిపోయినట్లు గుర్తింపు... 
పోలీసులు వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నల్లకుంట–సికింద్రాబాద్‌ స్టేషన్‌ మధ్య ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. 42 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన అధికారు లు విశ్లేషించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చీ హోటల్‌ వద్ద ఉన్న కెమెరాలో ఉదయం 6:28 గంటల ప్రాంతంలో బ్యాగు జారిపోవడం స్పష్టంగా రికార్డయింది. ఆ బ్యాగు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఆనుకుని ఉండటంతో ఎవరూ గమనించలేదు.  25 నిమిషాల తర్వాత అటుగా వచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ స్వీపర్‌ ఆ బ్యాగ్‌ను తీసుకున్నట్లు రికార్డ యింది. పోలీసులు గురువారం జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ను విచారించారు. బ్యాగు తీసుకున్న వ్యక్తి కె.రాములు అని, అత నిది ఇబ్రహీంపట్నం సమీపంలోని గంగారం అంటూ చెప్పాడు. రాములు కోసం ప్రయత్నించగా ఆచూకీ లభించలేదు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బవార్చీ హోటల్‌ ఎదురుగానే అదుపులోకి తీసుకున్నారు. 

డంపింగ్‌ యార్డ్‌లో రూ. 5 లక్షలు... 
బ్యాగులో అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో పాలుపోలేదని రాములు పోలీసులకు చెప్పాడు. అందులో రూ. 5 లక్షల్ని ముషీరాబాద్‌లోని డంపింగ్‌ యార్డ్‌లో పాతిపెట్టానన్నాడు. తన కుమారుడు కె.శ్రీశైలం ద్విచక్ర వాహనం ఖరీదు చేసుకోవడానికి రూ. 59,700, తన బావమరిది వి.శ్రీశైలానికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఇచ్చానని అంగీకరించాడు. మరో రూ. 23,40,300లు తన ఇంట్లో ఉన్నాయని వెల్లడించాడు. దీంతో డంపింగ్‌ యార్డ్, రాములు ఇంటి నుంచి పోలీసులు రూ. 28,40,300లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న ‘శ్రీశైలాల’ కోసం గాలిస్తున్నారు. కాగా ప్రతి ఒక్కరూ ‘నేను సైతం’కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుమతి కోరారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్, డీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రామకృష్ణలతో పాటు క్రైమ్‌ బృందాలను అభినందించారు. వీరికి ప్రత్యేక రివార్డులు అందించారు. 

మరిన్ని వార్తలు