కష్టాల్లో కమలం

18 Nov, 2018 15:53 IST|Sakshi

పార్టీకి దూరమవుతున్న నాయకులు, కార్యకర్తలు 

ప్రహ్లాద్‌రావు రాజీనామాతో పరిస్థితి మరింత అధ్వానం 

తాండూరులో అసమ్మతి సెగలు 

కొడంగల్‌లో స్థానికేతరుడికి టికెట్‌  

పరిగి, వికారాబాద్‌లో తేలని అభ్యర్థులు 

జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ పరిస్థితి రోజురోజుకు మసకబారుతోంది. ఒంటరి పోరాటంతో అధికారంలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శ్రేణులకు దిశానిర్దేశం చేయడం బాగానే ఉన్నప్పటికీ.. పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. రెండున్నర నెలల క్రితం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించగా, మహాకూటమి గెలుపుగుర్రాలను ఇటీవలే వెల్లడించారు. బీజేపీ మాత్రం మొదటి జాబితాలో తాండూరు, రెండో జాబితాలో కొడంగల్‌ స్థానానికి అభ్యర్థినిప్రకటించింది. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటివరకు వికారాబాద్, పరిగి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.  

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు కరణం ప్రహ్లాద్‌రావు మనస్తాపంతో శుక్రవారం కంటతడి పెట్టారు. కుల్కచర్లకు చెందిన ఈయనకు ఇతర పార్టీల నుంచి ఎన్నోసార్లు ఆహ్వానాలు వచ్చినా సొంతగూటిని వీడలేదు. పార్టీ బలోపేతానికి ప్రహ్లాద్‌ చేస్తున్న కృషి కారణంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.

ఈ క్రమంలో పరిగి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. ఎవరూ పోటీ కూడా లేకపోవడంతో టికెట్‌ దాదాపు ఖరారైనట్లేనని భావించారు. కానీ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు. మరికొంత మంది మండల బాధ్యులు పదవులు త్యజించారు. అనుచరులు, కార్యకర్తలు సైతం వీరి నిర్ణయాన్ని సమ్మతించారు.    

తిరుగుబాటు
కొడంగల్‌: కొడంగల్‌ బీజేపీ అభ్యర్థి నాగూరావ్‌ నామాజీపై అదే పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు తిరుగుబాటు ప్రకటించారు. తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో సమావేశమై నాగూరావ్‌ తీరుపై నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు. పార్టీ సంప్రదాయాలు, సిద్ధాంతాలను పాటించని వ్యక్తికి టికెట్‌ రావడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు కరెంటు రాములు, విజయవర్ధన్, రామూనాయక్, బంటు రమేష్, ఆవుల ఓంప్రకాశ్, దుబ్బాస్‌ కిష్టయ్య తదితరులు  ఉన్నారు. 

తాండూరులో పరిస్థితి అధ్వానం... 
 తాండూరులోనే కాస్తంత ఆశలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానానికి ఇటీవల నెలకొన్న పరిణామాలు మింగుడు పడటం లేదు. మెజార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఎన్‌ఆర్‌ఐ రవిశంకర్‌ పటేల్‌కు టికెట్‌ కేటాయించడంతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడారు. ఏళ్ల తరబడి సేవలందించిన తాండూరు సెగ్మెంట్‌ ఇన్‌చార్జి రమేష్‌కుమార్‌ సైతం కమలాన్ని వీడి గులాబీ గూటికి చేరారు. ఈయతో పాటు వందల మంది కార్యకర్తలు పార్టీకి గుడ్‌ బై చెప్పడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

బీజేపీ అభ్యర్థి రవిశంకర్‌ పటేల్‌ ఒంటెత్తు పోకడలతో పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదటి విడతలోనే టికెట్‌ దక్కించుకున్న రవిశంకర్‌ మాత్రం ఇప్పటికీ ప్రచారాన్ని వేగవంతం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలతోపాటు పార్టీ శ్రేణుల నుంచి సైతం స్పందన కరువైంది.   

కొడంగల్‌లో స్థానికేతర అభ్యర్థి... 
కొడంగల్‌ నియోజకవర్గం నుంచి నారాయణపేటకు చెందిన నాగూరావు నామోజీకి టికెట్‌ కేటాయించారు. ఇక్కడి నుంచి పోటీకి స్థానికులెవరూ ఆసక్తి చూపకపోవడంతో స్థానికేతరుడికి టికెట్‌ కేటాయించింది. ఈయన నామినేషన్‌ వేసిన సమయంలోనూ వేళ్లమీద లెక్కించేత మంది నాయకులు, కార్యకర్తలే రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి నరేందర్‌రెడ్డి బలమైన అభ్యర్థులుగా బరిలో ఉండటంతో బీజేపీ నామమాత్రమే కానుంది.   

వికారాబాద్, పరిగి టికెట్లు ఇంకెప్పుడో... 
వికారాబాద్, పరిగి సెగ్మెంట్ల నుంచి బీజేపీ అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. నామినేషన్‌కు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పరిగికి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ కుమారునికి టికెట్‌ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండగా.. వికారాబాద్‌ అభ్యర్థి ఎవరనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు