బిందాస్‌ ట్రాన్స్‌ఫర్‌!

14 Jul, 2018 10:44 IST|Sakshi

ఒత్తిడికి దూరంగా... ఇంటికి దగ్గరగా చూసుకున్న వైనం

రాజ్‌భవన్‌ సహా కీలక ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల కొరత

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

ముందస్తు పరిశీలన లేకుండా బదిలీలతో సర్కారు విద్యకు గండం

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం...అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం...ఖాళీలు భర్తీ చేయకపోవడానికి తోడు తీరా విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ స్కూల్లో ఏ ఏ మీడియంలో బోధన జరుగుతోంది? ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? ప్రస్తుతం ఎంతమంది టీచర్లు పని చేస్తున్నారు? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఎవరెవరు బదిలీపై వెళ్లనున్నారు?.. వంటి అంశాలపై కనీస కసరత్తు చేయకుండానే బదిలీల పక్రియ చేపట్టడంతో పలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతను మరచి...తమబాగోగులే ముఖ్యమని భావించారు. ఒత్తిడికి దూరంగా...సొంత ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలకు బదిలీ అయ్యారు. ఫలితంగా హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ పరిధిలోని రాజ్‌భవన్‌ పాఠశాల సహా కుల్సుంపుర, బంజారాహిల్స్‌లోని ఎంబీటీనగర్‌ స్కూలు, జీహెచ్‌ఎస్‌ నాంపల్లి(బోరబండ), అమీర్‌పే ట్‌–1, జీహెచ్‌ఎస్‌ చౌరా(ఉర్దూ మీడియం), సీతాఫల్‌మండి, జీహెచ్‌ఎస్‌ ఎల్లారెడ్డిగూడ, జీహెచ్‌ఎస్‌ ఎర్రమంజిల్, జీహెచ్‌ఎస్‌ షేక్‌పేట, హిమాంపూర్, మాసాబ్‌ ట్యాంక్‌(రెడ్‌క్రాస్‌), అంబర్‌పేట్‌ సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల కొరత ఏర్పడింది. గతంతో బదిలీల సమయంలో మొత్తం ఖాళీల్లో 50 శాతం ఖాళీలను మాత్రమే చూపించేవారు. ఈ సారి ఇందుకు విరుద్ధంగా వందశాతం ఖాళీలు చూపించడం వల్ల అప్పటి వరకు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న వారంతా బిందాస్‌గా తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ అయ్యారు. 

ఒత్తిడి తక్కువగా ఉన్న స్కూళ్లకే జై...
నిజానికి ఏ ఉపాధ్యాయుడైనా మంచి గుర్తింపు పొంది, మౌలిక సదుపాయాలు ఉండి, రాకపోకలకు అనుగుణంగా, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో పని చేయడానికి ఇష్టపడుతుంటారు. కొంత మంది అలాంటి స్కూల్లో పని చేసే అవకాశం దక్కడం గర్వంగా కూడా ఫీలవుతారు. కానీ హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీరు ఇందుకు భిన్నంగా ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై గవర్నర్‌ సహా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు వీటిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. ఉన్నతా ధికారుల పర్యవేక్షణలో పనిచేయడం ఇష్టంలేని ఉపాధ్యాయులు..ఇంటికి సమీపంలో...ఏ ఒత్తిడి లేని పాఠశాలలో పని చేయడమే నయమని భావించి ఆ మేరకు బదిలీపై వెళ్లిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు మంచి మార్కులతో ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు పొందిన విద్యాలయాలు సైతం ప్రస్తుతం పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది.

ఈ ఏడాది కూడా విద్యావాలంటీర్లే దిక్కు...
హైదరాబాద్‌జిల్లా పరిధిలో 689 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 12 పాఠశాలలు ఒకరిద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొస్తుంటే, అదే రంగారెడ్డి జిల్లాలో 1298 పాఠశాలలు ఉండగా, వీటిలో ఏకంగా 63 పాఠశాలల్లో అసలు ప్రభుత్వ ఉపాధ్యాయులే లేరు. బదిలీలకు ముందు 104 పాఠశాలల్లో ఒక్క రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు కూడా లేడంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని ఖాళీలను గతంలో మాదిరే ఈ ఏడాది కూడా విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ 698 మంది విద్యావాలంటీర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులు (1286 మంది విద్యావాలంటీర్లు) నేడో రేపో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆశ్చర్యకరమైన అంశమేమంటే వికారాబాద్‌ జిల్లా నుంచి భారీగా మేడ్చల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఇక్కడ పెద్దగా ఖాళీలు లేవు. కేవలం 153 మంది విద్యావాలంటీర్లు అవసరం ఉన్నట్లు గుర్తించింది.

మరిన్ని వార్తలు