రిజర్వాయర్‌లో మొసళ్లు!

28 Feb, 2020 09:16 IST|Sakshi

సాక్షి, కూసుమంచి(ఖమ్మం): ఆహ్లాదాన్ని పంచుతూ..మత్స్యసంపదకు నిలయంగా ఉన్న పాలేరు రిజర్వాయర్‌ మొసళ్లకు ఆవాసంగా మారుతోంది. ఏడాది కాలంగా అప్పుడప్పుడూ మొసలి పిల్లలు నీళ్లపై తేలియాడుతూ కనిపించడం, కొన్నిసార్లు మత్స్యకారుల వలలకు చిక్కడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ నెల 26వ తేదీన రిజర్వాయర్‌ పరిధిలోని సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ ప్రాంతంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ మొసలి చిక్కడంతో ఇప్పుడు మరింత భయాందోళన నెలకొంది. పోయిన సంవత్సరం రిజర్వాయర్‌లో మొసలి పిల్లలు ప్రత్యక్షం కాగా..అవి ఇప్పుడు పెద్దవి అయ్యాయని స్థానికంగా భావిస్తున్నారు. వాటి సంతానం ఉత్పత్తి అవుతుండడంతో రిజర్వాయర్‌ వాటికి ఆవాసంగా మారి భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారే అవకాశముందని జంకుతున్నారు. దాదాపు 50కుపైగానే పిల్ల మొసళ్లు ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. తాజాగా 70కిలోల మొసలి చిక్కడంతో..ఆ స్థాయిలోనే పెద్దవి మరికొన్ని ఉంటాయని, వాటని్నంటినీ బయటకు పంపే ప్రయత్నం చేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

త్వరలో చేపల వేట..
పాలేరు రిజర్వాయర్‌లో ప్రతి సంవత్సం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చేపలు, రొయ్యల వేట సాగుతుంది. ఈ సారి మార్చి మొదటి వారంలో చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పుడు రిజర్వాయర్‌లో మొసళ్లు ప్రత్యక్షం కావడం మత్స్యకారుల్లో కలకలం రేపుతోంది. సుమారు 1500 మంది మత్స్యకారులు నెలకుపైగా రిజర్వాయర్‌లో తెప్పలపై వెళుతూ చేపలు, రొయ్యలు వేటాడాల్సి ఉంటుంది. తమపై మొసళ్ల దాడి జరిగితే పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. చేపలకు బదులు అవి చిక్కితే  ప్రాణాలతో చెలగాటమేనని భయపడుతున్నారు.

మొసళ్లను తరలించాలి
పాలేరు రిజర్వాయర్‌లో వందవరకు మొసళ్లు ఉన్నాయి. మేం త్వరలో చేపల వేటకు వెళతాం. మొసళ్లకు మా వాళ్లు భయపడుతున్నారు. గతంలో ఒక్క మొసలి కూడా ఉండేది కాదు. వాటిని పట్టి వేరేప్రాంతానికి తరలించాలని అధికారులను కోరుతున్నాం. లేకుంటే మేం వేటకు వెళ్లడం కష్టమే. 
– దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి 

మరిన్ని వార్తలు