పంటల బీమా ప్రీమియం గడువు పెంపు

17 Jul, 2018 01:25 IST|Sakshi

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగనున్న ప్రీమియం చెల్లింపు

సాక్షి, హైదరాబాద్‌: పత్తి సహా ఇతర పంటల బీమా ప్రీమియం గడువును పెంచుతూ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. గతంలో వ్యవసాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మిర్చి పంటకు ప్రీమియం చెల్లించేందుకు ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 వరకు గడువుగా నిర్ధారించారు. పత్తి పంటకు ఏప్రిల్‌ 1 నుంచి జూలై 15 వరకు గడువుగా పెట్టారు. ఆయిల్‌పామ్‌కు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9వరకు గడువుగా ప్రకటించారు.

తాజాగా ఆ తేదీలను పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతుల నుంచి బీమా ప్రీమియం వసూలు చేయాలని ఆదేశించినట్లు పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతుల నుంచి పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించే పద్ధతిలో పట్టాదారు పాసు పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవద్దన్నారు. ఇప్పటివరకు రైతుబంధు చెక్కులు తీసుకున్న ప్రతీ రైతుకూ ప్రీమియం చెల్లించటానికి అవకాశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఖరీఫ్‌ సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్లు్యబీసీఐఎస్‌), యూనిఫైడ్‌ ప్యాకేజ్‌ ఇన్సూరెన్స్‌ స్కీం (యూపీఐఎస్‌)లు అమలుకానున్నాయి. ఆయా బీమా పథకాలను జాతీయ బీమా కంపెనీ (ఎన్‌ఐసీ), టాటా ఏఐజీ సాధారణ బీమా కంపెనీ, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు అమలుచేస్తాయి.  

మరిన్ని వార్తలు