2.08 లక్షల ఎకరాల్లో పంట నష్టం 

23 Aug, 2018 02:00 IST|Sakshi

     1.19 లక్షల ఎకరాల్లో పత్తి,55 వేల ఎకరాల్లో వరికి దెబ్బ 

     11 జిల్లాల్లో నష్టం వాటిల్లినట్లు సర్కారుకు వ్యవసాయశాఖ నివేదిక 

     ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 1.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం 

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 2.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయశాఖ బుధవారం సర్కారుకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. అందులో 1.19 లక్షల ఎకరాల్లో పత్తి, 55 వేల ఎకరాల్లో వరికి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. మొత్తం 11 జిల్లాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ఆ నివేదికలో వివరించింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కుండపోత వర్షాలకు పూర్తిగా పంటలు మునిగిపోయాయి. తీవ్ర వర్షాల కారణంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. అందులో పైన పేర్కొన్నట్లుగా 2.08 లక్షల ఎకరాల్లోని పంటలు పూర్తిగా చేతికందకుండా పోయినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. గురువారం నాటికి పూర్తి నష్టం లెక్కలు వెల్లడి కానున్నాయని అధికారులు చెబుతున్నారు.

అత్యధిక వర్షపాతంతో అధిక నష్టం 
అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. 11 జిల్లాల్లో 2.08 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 1.25 లక్షల ఎకరాల పంటకు నష్టం సంభవించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 35,137 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 97,547 ఎకరాల్లో పత్తికి నష్టం చేకూరింది. రాష్టవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాలు ముందున్నాయి. సాధారణం కంటే భూపాలపల్లి జిల్లాలో 63 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 59 శాతం వర్షపాతం నమోదు కావడంతో అక్కడే పంటలకు అధిక నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అత్యంత తక్కువగా జగిత్యాల జిల్లాలో 358 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపింది. 

పూత దశలో ఉండటంతో ఎక్కువగా.. 
పత్తి మొక్క దశ నుంచి పూత దశకు చేరుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు పడటంతో పంటకు ఎక్కువ నష్టం చేకూరింది. వరి ఇప్పుడిప్పుడే నాట్లు వేసిన దశలో ఉండటంతో దానిపై కూడా అధిక ప్రభావం పడింది. పెసర మొత్తం నాశనమై పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఖరీఫ్‌లో 90 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, వాటన్నింటికీ ఈ వర్షాలు మరింత ప్రాణం పోసినట్లేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే భారీగా పంటలకు నష్టం వాటిల్లడంతో ఏ మేరకు వీటికి బీమా పరిహారం అందుతుందోనన్న చర్చ జరుగుతోంది. 

మరిన్ని వార్తలు