పరిహారం అందేనా?

26 Nov, 2018 06:51 IST|Sakshi
ముదిగొండ మండలంలో నీట మునిగిన పత్తి పంట (ఇన్‌సెట్‌) కూసుమంచి మండలంలో మొలకెత్తిన పెసరను పరిశీలిస్తున్న జేడీఏ ఝాన్సీలక్ష్మీకుమారి (ఫైల్‌)

ఖమ్మంవ్యవసాయం: అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి..ఇదీ ఈ ఏడాది ఖరీఫ్‌ పరిస్థితి. సీజన్‌ ఆరంభంలో మోస్తరుగా కురిసి.. తర్వాత ముఖం చాటేసి, కొన్ని పంటలు ఎదుగుతున్న క్రమంలో, మరికొన్ని పైర్లు చేతికొచ్చే సమయంలో.. ఎడతెరిపి లేకుండా పడిన వానలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఆగస్టులో జిల్లాలో రోజుల తరబడి సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. పంటలు నీటమునిగి లోతట్టు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటనష్టంపై అంచనా వేసిన వ్యవసాయశాఖ పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోంది. అధికారులు ప్రభుత్వానికి పంటనష్టంపై నివేదిక పంపిన కొన్ని రోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో అసలు పరిహారం అందుతుందా? లేదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. నాడు సంభవించిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో జిల్లాలో దాదాపు 20రోజుల పాటు రెట్టింపు వానలు పడ్డాయి. దీంతో వాగులు....

వంకలు పొంగిపొర్లాయి. అంతేగాక చెరువులు, రిజర్వాయర్లు అలుగుపడ్డాయి. ఫలితంగా పల్లపు ప్రాంతాల్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు జలమయమయ్యా యి. పెసర పంట మాత్రం చేతికొచ్చే సమయంలో పనికిరాకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యానికి పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సమగ్రంగా పంటనష్టాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వాగులు, చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతా లతోపాటు వరద తాకిడికి కోతకు గురై.. ఇసుక మేటలకు గురై.. 33శాతం నష్టపోయిన పంటలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు నివేదికను రూపొందించారు.

నెలలు గడుస్తున్నా..  
అధికార యంత్రాంగం పంటనష్టంపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా.. పరిహారం ఇంకా మంజూరు కాలేదు. నివేదిక అందించిన కొద్దిరోజులకే అసెంబ్లీ రద్దు కావడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా నుంచి వెళ్లిన నివేదికలు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా కూడా ఈ సమస్యను అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో మండల వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

4,079 హెక్టార్లలో నష్టం..  
జిల్లాలో మొత్తం 4,079 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. అధికంగా పెసర దాదాపు 1800 హెక్టార్లు. తిరుమలాయపాలెం మండలంలోనే ఈ పంటకు బాగా నష్టం వాటిల్లింది. నీటి పారుదల కింద సాగు చేసిన వరి 1,000 హెక్టార్లలో, పత్తి 700 హెక్టార్లలో, 600 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వరికి హెక్టారుకు రూ.13,500, మొక్కజొన్నకు రూ. 8,333, పత్తికి రూ. 13,500, పెసరకు రూ. 13,500 పరిహారం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. 

పత్తి నీటమునిగి దెబ్బతింది.. 
అధిక వర్షాల కారణం గా చెరువు వెంబడి ఉన్న ఎకరం పత్తి 10 రోజులు నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతింది. దీంతో పంటను వదిలేశా. అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. పరిహారం ఇస్తారో.. ఇవ్వరో.. అర్థం కావట్లేదు.  – చోడపోయిన సంగం, కమలాపురం, ముదిగొండ మండలం 

పెసర కోతదశలో వర్షాలపాలైంది..  
10 ఎకరాల్లో పెసర పంట వేశా. ఆగస్టులో వచ్చిన వానలకు కోతదశలో నీటిపాలైంది. దీంతో పూర్తిగా పనికి రాకుండా పోయింది. పెట్టుబడి దాదాపు రూ.లక్ష వరకు పెట్టా. అధికారులు వచ్చి పంట నష్టానికి సంబంధించి రాసుకొని వెళ్లారు. ఇంత వరకు పరిహారం ముట్టలేదు. – కొప్పుల రాంరెడ్డి, బీరోలు, తిరుమలాయపాలెం మండలం  

మరిన్ని వార్తలు