-

సాగునీరివ్వండి మహాప్రభో!

9 Apr, 2018 12:16 IST|Sakshi
జూరాల ప్రధాన ఎడమ కాల్వకు రాళ్లు అడ్డంగా వేస్తున్న రైతులు

జూరాల ఆయకట్టులో ఎండుతున్న వరిపంటలు

మరో పక్షంరోజులు అందిస్తేనే గట్టెక్కే పరిస్థితి

చివరి దశలో ఇదేమిటని రైతుల ఆందోళన

ఆత్మకూర్‌ (కొత్తకోట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో వేలాది ఎకరాల్లో వరిని సాగుచేస్తున్న రైతులకు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. మరో 20రోజుల్లో పంట చేతికి వచ్చే ముందు నీటి సరఫరాను నిలిపివేయడంతో మండలంలోని ఆయకట్టు రైతులు సాగుచేసిన వరిపంటలు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారాయి. అసలే సాగునీరందక ఒకపక్క కాల్వల పరిధిలోని గ్రామాల రైతులు ఘర్షణలకు దిగుతుంటే.. మరోపక్క కాల్వలపై ఏర్పాటు చేసిన మోటార్లను అధికారులు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.

35 వేల ఎకరాల్లో వరి..
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, అనుసంధానమైన డీ–6, 7 కాల్వలతోపాటు ఎడమ కాల్వ, రామన్‌పాడు రిజర్వాయర్‌ కింద సుమారు 35 వేల ఎకరాల్లో వరిని సాగుచేశారు. మరో మూడు తడులు అందితే ఈ పంటలు చేతికొస్తాయి. కానీ జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న కాస్త నీటిని తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు రిజర్వాయర్‌కు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాల్వలపై మోటార్లను ఏర్పాటు చేసుకొని పొలాలకు నీటిని అందిస్తున్నారు. మరికొంత మంది నీళ్లు ముందుకు వెళ్లకుండా కాల్వల్లో ముళ్లపొదలు, రాళ్లు మట్టితో అడ్డుకట్టలు వేసి నీటిని తోడేసుకుంటున్నారు. ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి సాగునీరందిస్తామని ప్రకటించారని, ఆ మేరకు నీటిని విడుదలచేసి పంటలను కాపాడాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.

తాగునీటికే ప్రాధాన్యం..
రామన్‌పాడు రిజర్వాయర్‌ నుంచి జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, వనపర్తి తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రామన్‌పాడు రిజర్వాయర్‌లో 1021.08 సామర్థ్యానికి గాను 1014.02 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రోజురోజుకు ఈ నీటిమట్టం సైతం తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోతే జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తాగునీటి సంగతి పక్కన పెట్టి సాగునీరు విషయం మాట్లాడాలని, మరో పక్షంరోజులపాటు సాగునీరు అందిస్తేనే తాము సాగు చేస్తున్న పంటలు చేతికి వస్తాయని, లేకుంటే పంటలు ఎండిపోయి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు