కోటి సభ్యత్వాలు లక్ష్యం! 

25 Jun, 2019 02:29 IST|Sakshi

ఈ నెల 27న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

నెల రోజులపాటు కొనసాగనున్న టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీ య అనుకూలతలను ఆసరాగా చేసుకుని పార్టీ విస్తరణకు ఇదే అత్యంత అనువైన సమయమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి జూలై నెలాఖరు వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2017లో చేపట్టిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది.

టీఆర్‌ఎస్‌ చరిత్రలోనే తొలిసారిగా 75 లక్షల మంది పార్టీ క్రియాశీల, సాధారణ సభ్యులుగా నమోదయ్యారు. దీంతో దేశంలోనే ఎక్కువ మంది సభ్యులు కలిగిన పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ చేరింది. దీంతో కోటి మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని, దీనిలో 25 లక్షల మందిని క్రియాశీల కార్యకర్తలుగా, మరో 75 లక్షల మందిని సాధారణ సభ్యులుగా నమోదు చేయా లని నిర్ణయించింది.  

రెండు నియోజకవర్గాలకు ఒకరు... 
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఈ నెల 27వ తేదీన తెలంగాణ భవన్‌లో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ చేసిన తర్వాత పార్టీ అధినేత హోదాలో కేసీఆర్‌ ఈ సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లతోపాటు ముఖ్య నేతలు పార్టీ సభ్యత్వం స్వీకరిస్తారు. జూలై 20 నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకరు చొప్పున రాష్ట్ర కార్యవర్గంలోని నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు. నియోజవర్గాల వారీగా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిల పేర్లను 27వ తేదీన ప్రకటిస్తారు. 

మరిన్ని వార్తలు