మానవతా దృక్పథంతో వ్యవహరించారు

4 Jul, 2020 17:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం.

హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్‌ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్‌ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్‌ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. 

అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్‌ వారియర్స్‌ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్‌ వారియర్స్‌ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్‌ వారియర్స్‌ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం​’ అంటూ స్థానిక సీనియర్‌ న్యాయవాది కే. రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది.

 

మరిన్ని వార్తలు