సంతాన భాగ్యం... ‘బ్యాంకు’లో భద్రం!

29 Mar, 2018 08:37 IST|Sakshi

సిటీలో అండాలు(ఎగ్‌), వీర్యకణాల(స్పెర్మ్‌) నిల్వకు ప్రత్యేక సెంటర్లు

కెరీర్‌లో బిజీగా మారి ప్రెగ్నెన్సీనివాయిదా వేసుకుంటున్న వైనం

వయసు పెరిగేకొద్దీ తగ్గుతున్నఎగ్, స్పెర్మ్‌ క్వాలిటీ..

ముందే జాగ్రత్త పడుతున్న దంపతులు

ఎగ్‌ అండ్‌ స్పెర్మ్‌ బ్యాంకులకుపెరుగుతున్న ఆదరణ

బంగారం.. వజ్రాభరణాలే కాదు.. ‘సంతాన భాగ్యాన్ని’ ప్రత్యేక  ‘క్రయో ప్రిజర్వేషన్‌’ బ్యాంకుల్లో భద్రపరిచే సౌకర్యం సిటీలో అందుబాటులోకి వచ్చింది. మీ కలల ప్రతిరూపాలను సిద్ధం చేసే అండాలనూ పదికాలాల పాటు సురక్షితంగా ఉంచే ఎగ్‌ బ్యాంక్‌లు ఇప్పడు నగరంలో వెలిశాయి. కెరీర్‌..ఉద్యోగం...బిజీలైఫ్‌తో పిల్లలను కనడం వాయిదా వేసుకునే దంపతులకు ఈ ఎగ్, స్పెర్మ్‌ బ్యాంకులు ఆదరువులా మారాయి. నగరంలో ఇప్పటికే పాతిక వరకు ఎగ్‌ బ్యాంక్‌లు (అండాలను భద్రపరిచే) ఏర్పాటయ్యాయి. వయసులో ఉన్నప్పుడు అండాలను ఆయా బ్యాంకుల్లో ఐదు నుంచి పదేళ్ల వరకు భద్రపరచి.. తమకు కావాలనుకున్నప్పుడు సంతానం పొందేలా అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి రావడం పలువురికి ఉపయోగకరంగా మారింది.

సాక్షి, సిటీబ్యూరో:ఒకప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాది తిరక్క ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. భార్య ఒక షిప్ట్‌లో పని చేస్తుంటే, భర్త మరో షిప్టులో పని చేస్తుండటం వల్ల కనీస దాంపత్యానికి నోచుకోలేక పోతున్నారు. యుక్తవయసు దాటిన తర్వాత వివాహం చేసుకోవడంతో పాటు కెరీర్‌ వేటలో పడి చాలా మంది మహిళలు పిల్లలను వాయిదా వేసుకుంటున్నారు. ఒక వయసు దాటిన తర్వాత పిల్లల కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ముందే జాగ్రత్త పడుతున్నారు. భార్య అండాల(ఎగ్‌)తో పాటు, భర్త వీర్యకణాల(స్పెర్మ్‌)ను సేకరించి భద్రపరుచుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. యుక్తవ యసులోనే తమ అండాలను సేకరించి భద్రపరుచుకుంటున్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం నగరంలో ఈ బ్యాంక్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో 28 ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, వీటిలో చాలా వరకు ఈ ‘క్రయో ప్రిజర్వేషన్‌’ బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

కేన్సర్‌ బాధితులు కూడా...
బిజీ లైఫ్, ఒత్తిడి, నియమాలు లేని ఆహారపు అలవాట్లు స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీకెండ్‌ పార్టీల పేరుతో పీకలదాక తాగడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్‌లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాకు పరుగులు తీస్తున్నారు. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌(ఐవీఎఫ్‌), ఇంట్రాసైటో ప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌(ఐసీఎస్‌ఐ)చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. వైద్యరంగంలో అనేక సాంకేతిక మార్పులు చోటు చేసుకోవడం, చికిత్సలపై దంపతుల్లో అవగాహన పెరగడం వల్ల చాలా మంది ముందే మేల్కొంటున్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎగ్, స్పెర్మ్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉంటుండటంతో పాటు త్వరగా ఫలదీకరణం చెందే గుణంఉండటం వల్ల ముందే భద్రపరుచుకోవాలని భావిస్తున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా కేన్సర్‌ వంటి జబ్బులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులు కూడా వీటిని ఆశ్రయిస్తుండటానికి మరో కారణం. 

ఒకసారి భద్రపరిస్తే..పదేళ్ల వరకు డోకా ఉండదు

మహిళల్లో పీరియడ్స్‌ వచ్చిన తర్వాత హార్మోన్స్‌ను సేకరిస్తారు. దీన్ని పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత వరుసగా పది రోజుల పాటు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తారు. ఎగ్‌(అండం) సైజ్‌ను ఓ స్థాయికి వృద్ధి చేసి, ఆ తర్వాత ప్రత్యేక నీడిల్‌ సహాయంతో అండాలను బయటికి తీస్తారు. ఇలా సేకరించిన అండాలను లిక్విడ్‌ నైట్రోజన్‌తో కూడిన క్రయోప్రిజర్వేషన్‌ బాక్స్‌లో భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన అండాలు పదేళ్ల వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మహిళ వయసు, మోనోపాజ్‌ను దృష్టిలో ఉంచుకుని వైద్యులు సిఫార్సు చేస్తారు.

ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో అండాలను సేకరించి భద్రపరిస్తే..ఐదేళ్లలో వినియోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇందుకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఛార్జీ చేస్తుండటం వల్ల మధ్య తరగతి దంపతులు కూడా ఈ కేంద్రాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇదే తరహాలో పురుషుల నుంచి స్పెర్మ్‌ను కూడా సేకరించి భద్రపరుస్తుంటారు. అయితే ఎగ్‌బ్యాంక్‌లను ఆశ్రయిస్తున్న వారిలో పురుషులతో పోలిస్తే..మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం.

ఎగ్‌ బ్యాంక్‌లు దంపతులకు ఓ వరం
మారిన జీవనశైలి వల్ల చాలా మంది మహిళల్లో చిన్న వయసులోనే మోనోపాజ్‌ మొదలవుతుంది. శరీరానికి కనీస వ్యాయాయం లేకపోవడం, ఏదీపడితే అది తినడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇవి పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కనాల్సిన వయసులో పిల్లలు కనకపోవడం వల్ల ఆ తర్వాత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. ఇలాంటి వారికి ఎగ్‌బ్యాంకులు ఓ వరం లాంటివే. మా ఆస్పత్రిలో నాలుగేళ్ల క్రితమే ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ..వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. నోవా ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌లో ఇప్పటికే 15 మంది తమ ఎగ్స్‌ను భద్రపరుచుకున్నారు.– డాక్టర్‌ సరోజ కొప్పాల, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఆస్పత్రి 

మరిన్ని వార్తలు