‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’

4 Nov, 2019 10:45 IST|Sakshi

కేంద్రం డిప్యుటేషన్‌ ఆఫర్‌ని తిరస్కరించారని భావించొచ్చా?

ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌తో ట్విట్టర్లో సీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 401తో తీవ్ర ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్‌లో సూచీ 39తో మంచి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్‌లో ఉండడానికే నేను ఇష్టపడడానికి మరో కారణమిదే’ అని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ‘అయితే, కేంద్రం నుంచి వచ్చిన డిప్యుటేషన్‌ ఆఫర్‌ను మీరు తిరస్కరించినట్లు నేను భావించవచ్చా?’అని రీట్వీట్‌ చేస్తూ ఆదివారం సరదాగా వ్యాఖ్యానించారు.

‘ఢిల్లీ నుంచి మరో గంటలో నేను ఇంటికి (హైదరాబాద్‌) వచ్చేందుకు విమానం ఎక్కబోతున్నాను. తిరిగి వచ్చాక నా ఆనందానికి ఇదే కారణం (ఢిల్లీలోని కాలుష్యం) కాబోతోంది’అని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్రిటిష్‌ రాయబారి ఆండ్రూ ఫ్లెమింగ్‌ కూడా మరో రీట్వీట్‌ చేశారు. కాలుష్యం విషయాన్ని పక్కనబెడితే రోడ్ల విషయంలో హైదరాబాద్‌ అధ్వానంగా తయారైందని, ఢిల్లీ స్థాయిలో నగరంలోని రోడ్లను అభివృద్ధిపరచాలని పలువురు నెటిజన్లు రాష్ట్ర అధికారులకు సూచించారు. 

>
మరిన్ని వార్తలు