తాత్కాలిక సచివాలయానికి సీఎస్‌ 

14 Aug, 2019 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం తరలింపు నేపథ్యంలో బీఆర్‌ కేఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా తదితరులు తమకు కేటాయించిన చాంబర్‌ నుంచి విధులు నిర్వర్తించారు. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు పనులతో పాటు తన చాంబర్‌లో కొనసాగుతున్న పనులను సీఎస్‌ పరిశీలించారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు సాగేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. కాగా, మంగళవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి విధులు నిర్వర్తించాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో.. పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఫైళ్లకు సంబంధించిన మూటలతో బీఆర్‌కేఆర్‌ భవన్‌కు తరలిరావడం కనిపించింది.  

జపాన్‌ బృందంతో జయేశ్‌ భేటీ 
తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటైన తన కార్యాలయాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంగళవారం ప్రారంభించారు. తన చాంబర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. జపాన్‌కు చెందిన డెన్షో కంపెనీ ప్రతినిధులతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న డెన్షోకు షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌లోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. బేరింగ్‌ ఉత్పత్తులను వివిధ దేశాలకు సరఫరా చేసే డెన్షో ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగలేదని, సాధారణ భేటీ మాత్రమేనని జయేశ్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు