యాంత్రీకరణలో...వాహ్‌ తెలంగాణ

7 Oct, 2019 05:23 IST|Sakshi

సీఎస్‌ ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం వ్యవసాయ యాంత్రీకరణలో దూసుకుపోతోంది.ఒకవైపు సాగు నీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. వ్యవసాయ యంత్రాలు, పంట కోత యంత్రాలు, నిర్మాణ పరికరాల్లో వృద్ధి ఎంతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్కే జోషి ఆదివారం ట్వీట్‌ చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వివిధ రకాల వాహన పరికరాలన్నీ కలిపి 1.22 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రాక్టర్లు మొత్తం 2.87 లక్షలున్నాయని, అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు అదనంగా 1.36 లక్షల ట్రాక్టర్లు ఇచ్చారు. అంటే 90.39% ట్రాక్టర్లు తెలంగాణ వచ్చాకే ఇచ్చినట్లు అర్థం అవుతోంది. ఇక పంట కోత యంత్రాలు మొత్తం రాష్ట్రంలో 26,856 ఉంటే, అందులో తెలంగాణ వచ్చాకే 12,736 ఇచ్చారు. అంటే 92.48% కొత్త రాష్ట్రంలోనే ఇచ్చారని స్పష్టమవుతోంది.   మొత్తంగా వ్యవసాయ యంత్రాలు, ట్రాలీలు, నిర్మాణరంగంలో ఉపయోగించే వాహన పరికరాల వృద్ది తెలంగాణ వచ్చాక 71.4%ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు