విపత్తులో.. సమర్థంగా..

19 May, 2019 03:13 IST|Sakshi
కిలో ల్యాబ్‌ను ఆవిష్కరిస్తున్న శేఖర్‌ సి.మండే. చిత్రంలో ఎ.వి.రామారావు, చంద్రశేఖర్‌ తదితరులు

సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీలు ఫానీలో ఉపయోగపడ్డాయి

శుద్ధమైన నీరు, ఆహారం అందించగలిగాం

కలసికట్టుగా సామాజిక ప్రయోజనాలున్న పరిశోధనలు

సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మండే 

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాల సమర్థ నిర్వహణకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిశోధనశాలలు తమవంతు కృషి చేస్తున్నాయని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మండే తెలిపారు. ఇటీవలి ఫానీ తుపాను సమయంలో చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థ ఎస్‌ఈఆర్‌సీ డిజైన్‌ చేసి, రెడ్‌క్రాస్‌ సంస్థ నిర్మించిన తుపాను బాధితుల కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని, అలాగే గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ తుపాను బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మొబైల్‌ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను సరఫరా చేసిందని చెప్పారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో పద్మభూషణ్‌ ఎ.వి.రామారావు ‘కిలో’ల్యాబ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్‌ మాట్లాడుతూ, తుపాను బాధితులకు అందించే ఆహారం శుభ్రంగా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మైసూరులోని సీఎస్‌ఐఆర్‌ సంస్థ సీఎఫ్‌టీఆర్‌ఐ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసిందని, దీని సాయంతో అతితక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో ఆహారపు పొట్లాలను సిద్ధం చేయగలిగామ ని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రపు నీటితోపాటు ఎలాంటి మురికి నీటినైనా శుద్ధి చేసి గంటకు నాలుగు వేల లీటర్ల తాగునీరు ఇవ్వగల మొబైల్‌ వ్యాన్‌ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశం మొత్తమ్మీద పదుల సంఖ్యలో సీఎస్‌ఐఆర్‌ సంస్థలు ఉన్నాయని.. వేర్వేరు పరిశోధన సంస్థలు కలిసికట్టుగా ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోందని, వ్యవసాయ సంబంధిత ఆగ్రో మిషన్‌లో ఎనిమిది సంస్థలు పాల్గొంటుండగా.. ఫార్మా మిషన్‌లోనూ ఐదు సంస్థలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని వివరించారు. 

కిలో ల్యాబ్‌ ప్రత్యేకమైంది: శ్రీవారి చంద్రశేఖర్‌ 
ఐఐసీటీ ప్రాంగణంలో ఆవిష్కృతమైన పద్మభూషణ్‌ ఎ.వి.రామారావు కిలో ల్యాబ్‌ చాలా ప్రత్యేకమైందని.. అత్యంత పరిశుద్ధమైన వాతావరణంలో మం దుల తయారీకి అవసరమైన రసాయనాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలు కల్పిస్తుందని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు. సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ల్యాబ్‌ ప్రత్యేకతలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పరిశోధనశాల ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించామని, ఫార్మా రంగపు స్టార్టప్‌ కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. యాంటీ వైరల్, కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోనూ సురక్షితంగా పనిచేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన శాలలో తయారైన రసాయనం మరే ఇతర శుద్ధీకరణ అవసరం లేకుండా ఫార్మా కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం వాడుకోవచ్చునన్నారు. 2021 నాటికి దేశీయంగానే కీటకనాశినులు, పురుగుల మందులు తయారు చేసేందుకు ఐఐసీటీ ప్రయత్నాలు చేస్తోందని.. డ్యూపాంట్, సిన్‌జెంటా తదితర అంతర్జాతీయ కంపెనీల 15 కీటకనాశినుల పేటెంట్లకు కాలం చెల్లనున్న నేపథ్యంలో వాటిని మరింత మెరుగుపరిచి సొంతంగా తయారు చేస్తామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు