సీఎస్‌టీ యాప్‌.. ట్యాక్స్‌లో టాప్‌

28 Jun, 2019 13:36 IST|Sakshi

దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం  

అంతర్రాష్ట్ర అమ్మకాల పన్ను వసూళ్లు సులభం 

రాష్ట్ర ఖజానాకు రూ.2 వేల కోట్లు ఆదాయం లక్ష్యం 

దేశానికే ఆదర్శంగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ 

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే తొలిసారిగా సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ (సీఎస్‌టీ) విధానానికి శ్రీకారం చుట్టింది. అంతర్రాష్ట అమ్మకాల పన్ను వసూళ్లకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దేశ పన్ను వసూళ్ల వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ మార్గదర్శకాలతో ఉన్నత అధికారుల రూపొందించిన సీఎస్‌టీ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ ఎంతో సులభతరమైందని అధికారులు చెబుతున్నారు.

యాప్‌లో అంతర్రాష్ట అమ్మకాలు, డీలర్లకు సంబంధించిన వివరాలతో పాటు వారు సమర్పించాల్సిన సీ, ఎఫ్, ఐ ఫారాలతో పాటు బిల్‌ ఆఫ్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన దస్తావేజులను ఉంచారు. దీంతో పాటు డీలర్లు పన్ను మినహాయింపునకు అందించాల్సిన ఫారాలు సమర్పించారా..? అమ్మకాలకు తక్కువ ధరల కోసం నివేధికలు అందింOచారా..? అనే సమాచారం యాప్‌లో పొందుపర్చారు. పన్ను వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్‌లో ఉండడంతో అధికారులకు విధులు సులభతరమయ్యాయి.  

యాప్‌తో అన్ని ప్రక్రియలూ సులువు..  
సీఎస్‌టీ యాక్ట్‌ కింద ఈ ఏడాది జూన్‌ వరకు అంతర్రాష్ట్ర అమ్మకాలపై డీలర్లు కోరిన పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు సంబంధించి సీ, ఎఫ్, ఐ ఫారాల బిల్‌ ఆప్‌ ల్యాండింగ్‌ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై కోరిన మినహాయింపులు, అంతర్రాష్ట్ర, తక్కువ పన్ను రేట్లను తర్వాత త్రైమాసికం లోపు దస్తావేజులు రుజువులు, పత్రాలు వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు సమర్పించాలి. ఒకవేళ వారు సమర్పించని పక్షంలో.. సమర్పించని అమ్మకాల వివరాలను సాధారణ అమ్మకాలుగా పరిగణించి పన్ను మదింపు చేస్తారు.

దీనికిగాను వాణిజ్య పన్నుల శాఖకు నాలుగేళ్లలోపు మదింపు చేయాల్సి ఉంటుంది. కానీ వాణిజ్య పన్ను శాఖ మదింపు చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది, సమయం కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్‌టీ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా అన్ని సీఎస్‌టీ నోటీసులు గత సంవత్సరాలకు సంబంధించినవన్నీ డీలర్ల నమోదు చేసిన ఈ మెయిల్‌ అడ్రస్‌కు ఒకే క్లిక్‌తో వెళ్లిపోయే వెసులుబాటు కలిగింది. ఈ ప్రక్రియతో వాణిజ్య పన్నుల శాఖకు సమయం ఆదా అవుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ మంది అవసరం ఉండదు.

నోటీస్‌ అందిన డీలర్లు వాటిలో ఉన్న ఒక లింక్‌ ద్వారా అభ్యంతరాలు, రుజువులు, పత్రాలను, ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత డీలర్లు ఈ– మెయిల్‌ ద్వారా వ్యక్తిగత వివరణ పత్రం చేరుతుంది. దీనిని  ఆన్‌లైన్‌లో పూర్తి చేసి అధికారులు ఇచ్చిన తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి.  

పారదర్శకతకు అవకాశం..  
సీఎస్‌టీ పన్ను వసూళ్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కంప్యూటర్, ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగుతుంది. ఇటు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అటు డీలర్లు సమర్పిస్తున్న వివరాలు అన్ని ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. డీలర్లు సమర్పించాల్సిన పత్రాలు, రుజువులు, వివరాలు అన్ని ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదు.

ఒకవేళ ఏవైనా దస్తావేజు పత్రాలు సమర్పించకపోతే ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. దీంతో పన్ను వసూళ్ల ప్రక్రియా మొత్తం పారదర్శంగా కొనసాగుతోంది. ఈ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ సులభంగా మారింది.

ఒక్కో అధికారికి 50 మంది డీలర్లు లక్ష్యంగా..

సీఎస్‌టీ పన్ను వసూళ్ల కోసం కేంద్ర కార్యాలయం ద్వారా సర్కిల్‌లోని ఒక్కో అధికారికి 50 మంది డీలర్ల పన్ను వసూళ్లకు టార్గెట్‌ ఇస్తున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం సీ, ఎఫ్, ఐ ఫారాలు, నివేదికలు అందజేసే డీలర్ల వివరాలను అధికారులకు టార్గెట్‌గా ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు తొలుత ఫోన్‌ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు.

డీలర్ల వివరాలు అందజేయనివారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న డీలర్లు వివరాలను ఆన్‌లైన్‌లో అందించి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు ఉన్నతాధికారులు లక్ష్యంగా  నిర్దేశించుకుని ముందుకెళ్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా