పట్టాలి అరక.. దున్నాలి మెరక

14 Oct, 2014 03:34 IST|Sakshi
పట్టాలి అరక.. దున్నాలి మెరక

వానలు లేవు. ఎండలు మండుతున్నయి. పంటలు మాడిపోయినయి. కరువు తరుముకొస్తోంది. తీరని దుఃఖంతో కొందరు రైతులు ఎండిన పంటలకు నిప్పు పెట్టిండ్రు.  ధైర్యం సడలని మరి కొందరు రైతులు నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో  ‘నాగేటి సాల్లల్లో నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ పంటల సాగుకు సమాయత్తమవుతుండ్రు. మనసుంటే మార్గం లేదని నిరూపిస్తుండ్రు. ఆశల వేటను ఆనందంగా సాగిస్తుండ్రు. సింగూరుతో ప్రమాదముందని తెలిసినా వారు ముందుకే ‘సాగు’తుండ్రు. - నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా
* శిఖం భూములలో నాగేటి సాళ్లు
* దుక్కులు దున్నుతున్న రైతన్నలు
* శనగ, మొక్కజొన్న విత్తుతున్నరు
* ఊరును విడిచి, పట్టాభూములు వదిలి
* ఆశల సాగుకు అన్నదాత అడుగులు
 నిజాంసాగర్: ఉన్న ఊరు.. పట్టా భూములను వదిలి శిఖం భూములలో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వానలు ఆశిం చిన మేరకు కురవకపోవడంతో.. నీళ్లులేక నల్ల రేగడి మట్టి తేలిన నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూములలో ఆరుతడి పంటలను వే స్తున్నారు. వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాల లో నాగటి సాల్లు జోరందుకున్నాయి. అరక చేతపట్టిన రైతన్నలు శిఖం భూముల్లో శనగ, జొన్న విత్తనాలు చల్లుతున్నారు.

మంజీరా నదిపై ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర స్తుతం నీళ్లులేక  బోసి పోయి ఉన్నా, పచ్చని పంటల సాగుకు నిలయం కానుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడ శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించిన ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియా అపరాల సాగుకు దోహదపడుతోంది. ఖరీఫ్ సీజన్‌లో వానలు కురవక పోవడంతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు రబీ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఉపాధి కోసం అన్వేషిస్తున్న రైతులు పట్టాభూములలో పంటలు వేయలేక శిఖం భూములను ఆశ్రయించారు.

మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది  మంది రైతులు శిఖం భూములలో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూములలో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సుమా రు 300 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు.
 
సింగూరు నీరొస్తే మునిగినట్టే...
నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో శిఖం భూములలో రైతులు పండిస్తున్న శనగ, జొన్న పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది.సాగర్ ఆయకట్టు కింద పండిస్తున్న పంటల కోసం, ఒక వేళ సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌కు నీటి విడుదల చేస్తే శిఖం భూములు మునిగిపోతాయి. రైతన్నలు ఆశతో సాగు చేస్తున్న పంటలు సైతం నీటి పాలవుతాయి. అయినా కుటుం బపోషణ కోసం ధైర్యం చేసి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు. కరువును జయించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు