పచ్చని సిరి... వరి

5 Sep, 2019 03:47 IST|Sakshi

రికార్డు స్థాయిలో వరి సాగు.. 111% నాట్లు

105% పత్తి సాగు.. పప్పుధాన్యాల సాగు 88%

28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం.. రెండు జిల్లాల్లో అధిక వర్షం 

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ పంటల సాగు కోటి ఎకరాలకు మించి సాగైంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1.02 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సర్కారుకు నివేదిక పంపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గణనీయంగా కురవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి నాట్లు పడ్డాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, 26.79 లక్షల ఎకరాలు (111%) సాగు కావడం గమనార్హం. పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 45.32 లక్షల ఎకరాలకు (105%) చేరింది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.46 లక్షల ఎకరాలు (76%) సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.18 లక్షల ఎకరాలు (88%) సాగైంది.  

పురుగుల దాడి 
సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.3 లక్షల ఎకరాలు (82%) సాగైంది. 11 జిల్లాల్లో వంద శాతంపైగా విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో 122 శాతం చొప్పున విస్తీర్ణంలో పంటలు సాగవడం గమనార్హం. నిర్మల్‌ జిల్లాలో 116 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో అత్యంత తక్కువగా 80 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వరిపై స్టెమ్‌ బోరెర్‌ అనే పురుగు దాడి చేస్తుంది. ఇక మహబూబ్‌నగర్, గద్వాల, ఖమ్మం, జనగాం జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి చేస్తోంది. జనగాం, జగిత్యాల జిల్లాల్లో పత్తిపై పచ్చ పురుగు దాడి చేస్తోందని వ్యవసాయ శాఖ తెలిపింది. 

మూడు జిల్లాల్లో లోటు.. 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 611.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 597.6 మిల్లీమీటర్లు (–2%)నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే 28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ అర్బన్, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు