మొండి బకాయిలకు వన్‌టైం సెటిల్‌మెంట్‌

7 Aug, 2019 11:02 IST|Sakshi
ఆదిలాబాద్‌లోని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయం

జీపీ, మున్సిపల్‌ పెండింగ్‌ విద్యుత్‌ బిల్లులపై సర్కారు నిర్ణయం

జిల్లాలో రూ.130 కోట్ల బకాయిలు

ఇక నుంచి నెలవారి బిల్లులు చెల్లించాల్సిందే

సాక్షి, ఆదిలాబాద్‌: పెండింగ్‌ బకాయిలు విద్యుత్‌ శాఖకు పెను భారంగా మారాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.53 కోట్లు గ్రామపంచాయతీ బకాయిలు ఉండగా రూ.1.20 కోట్ల మున్సిపల్‌ బకాయిలు ఉన్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్‌ శాఖకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పెండింగ్‌ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీ, మున్సిపల్‌తో పాటు విద్యుత్‌ శాఖకు ఊరట లభించనుంది. పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌గా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా, విద్యుత్‌ సరఫరా నిలిపివేసినా ఆయా శాఖల నుంచి స్పందన కరువైంది. సీఎం నిర్ణయంతో విద్యుత్‌ శాఖ అధికారులకు ఉపశమనం కలగనుంది. మొండి బకాయిలకు మోక్షం లభించే అవకాశం వచ్చిందని ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం రూ.130 కోట్లు పెండింగ్‌ బకాయిలు ఉన్నాయి. వీటిలో రైల్వే రూ.6లక్షల వరకు, టెలిఫోన్‌ రూ.25 లక్షల వరకు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రూ.62 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖ రూ.1.10 కోట్ల వరకు, రెవెన్యూ రూ.19 లక్షల వరకు, ఉన్నత విద్య శాఖ రూ.90లక్షల వరకు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.25 లక్షల వరకు, గిరిజన సంక్షేమ శాఖ రూ.43 లక్షలు, మున్సిపల్‌ రూ.1.20 కోట్లు, మేజర్‌ గ్రామపంచాయతీలు రూ.16.20 కోట్లు, మైనర్‌ గ్రామపంచాయతీలు రూ.36.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.

నెలనెలా చెల్లించాల్సిందే...
మొండి బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసిన తర్వాత జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, మున్సిపల్‌ అధికారులు నెలనెలా బిల్లులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌ విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించనుండడంతో నెలనెలా బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి మొండి బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా వసూలు చేయాలని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపట్టలేదని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాడలేని ప్రిపెయిడ్‌ మీటర్లు..
మొండి బకాయిలకు చెక్‌ పెట్టేందుకు విద్యుత్‌ శాఖ ప్రిపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది క్రితమే ప్రకటించినా ఇంతవరకు దాని జాడలేకుండా పోయింది. ప్రిపెయిడ్‌ మీటర్లు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమర్చలేదు. ప్రస్తుతం మ్యానువల్‌గానే బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రిపెయిడ్‌ మీటర్లు బిగిస్తే సిమ్‌కార్డు తరహాలో రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే దారిలేక తప్పనిసరిగా బిల్లులు చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు ప్రిపెయిడ్‌ మీటర్ల విధానం అమలుకు నోచుకోవడం లేదు. 

సమస్యలు పరిష్కరించేందుకు..
గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, వీధి దీపాలకు స్విచ్‌లను ఏర్పాటు చేసేందుకు పూనుకుంటున్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

జీపీ బకాయిలే అధికం
జిల్లాలో గ్రామపంచాయతీ బకాయిలే అధికంగా ఉన్నాయి. రూ.53 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. మున్సిపల్‌ బకాయిలు రూ.1.20 కోట్ల వరకు ఉన్నాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ వినియోగదారులు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి విద్యుత్‌ శాఖకు సహకరించాలి. – ఉత్తం జాడే, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, ఆదిలాబాద్‌  

>
మరిన్ని వార్తలు