మరుగుదొడ్డి లేదని ‘రేషన్‌’ కట్‌

17 Jul, 2018 09:08 IST|Sakshi
సరుకులు ఇవ్వడం లేదని తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన గ్రామస్తులు   

తహసీల్దార్‌తో మొరపెట్టుకున్న లబ్ధిదారులు

మరుగుదొడ్లు నిర్మించకపోవడంతో నిలిపివేసిన అధికారులు

తాండూరు రూరల్‌ : స్వచ్ఛభారత్‌ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేదని అధికారులు రేషన్‌ సరుకులు నిలిపివేశారు. కనీసం తాత్కలికంగా రేషన్‌ సరుకులు నిలిపివేస్తే కొందరైన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటారని అధికారులు ఈ విధంగా చేసినట్లు సమాచారం. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన మాల శ్రీను, బంటు మొగులప్ప డిమాండ్‌ చేశారు.

సోమవారం తహసీల్దార్‌ రాములును కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్‌ డీలర్‌ లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదన్నారు. డీలర్‌ అశప్పను అడగ్గా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారని చెప్పారు.  గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే రేషన్‌ ఇస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

బియ్యం లేకపోతే ఎలా బతకాలి అని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో గ్రామంలో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై తహసీల్దార్‌ రాములును ఫోన్‌లో సంప్రదిస్తే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల ఎంపీడీఓ డీలర్‌కు చెప్పి రేషన్‌ సరుకులు ఇవ్వొదని చెప్పారని  తహసీల్దార్‌ బదులిచ్చారు. ఎంపీడీఓ జగన్మోహన్‌రావుకు ఫోన్‌ చేస్తే స్పందించలేదు.

పంపిణీ చేస్తాం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రేషన్‌ సరుకులు నిలిపివేశాం. అంతేకాకుండా డీలర్‌ ఆశప్ప అనార్యోగం కారణంగా కూడా సరుకులు ఆలస్యమయ్యాయి . మంగళవారం నుంచి ప్రతి ఒక్కరికీ రేషన్‌ సరుకులు అందజేస్తాం.       – ఇస్మాయిల్, సర్పంచ్‌

మరిన్ని వార్తలు