దేశంలోనే కాళేశ్వరం అద్భుత ప్రాజెక్టు

26 May, 2018 01:39 IST|Sakshi

సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఎస్‌కే రంజన్‌  

పూర్తి నాణ్యతాప్రమాణాలతో నిర్మిస్తున్నారని కితాబు

ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అద్భుతమైందని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్‌ ఎస్‌కే రంజన్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఏడు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 6, 7, 8 ప్యాకేజీ పనులను ఎస్‌కే రంజన్‌ నాయకత్వంలో 12 మంది సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులు పరిశీలించారు.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో లక్ష్మీపూర్‌ వద్ద నిర్మిస్తున్న సర్జ్‌పూల్, ప్రాజెక్టు పనులను కూడా సీడబ్ల్యూసీ సభ్యులు పరిశీలించారు. డైరెక్టర్‌ ఎస్‌కే రంజన్‌ మీడియా తో మాట్లాడుతూ, కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఇక్కడి ఇంజనీరింగ్‌ అధికారులు ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం వాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలలు కంటున్న బంగారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తప్పకుండా సాకారమవుతుందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే బాహుబలి ప్రాజెక్టుగా నిలుస్తుందని కితాబిచ్చారు. కార్మికుడు మొదలుకుని ఇంజనీరింగ్‌ అధికారులు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. భూగర్భంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి, రివర్స్‌ పంపింగ్‌తో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరందించే విధానాన్ని సభ్యులు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సీడబ్ల్యూసీ బృందం సభ్యులు ఎ.కృష్ణారావు, నమ్రత్‌ అగర్వాల్, ఆశ్వినికుమార్, కె.వ్యాసక్‌రావ్, ధీరజ్‌కుమార్, సాకేత్‌కుమార్, బీఎస్‌. ప్రసాద్, అమిత్‌కుమార్, ఇషాన్‌ శ్రీవాత్సవ, సుమన్, కాళేశ్వరం సీఈ ఎన్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు