‘సైబర్‌’ ఘంటికలు!

12 Aug, 2018 02:46 IST|Sakshi

ఏటా భారీగా పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు 

బ్యాంకు ఖాతాలు,వ్యక్తిగత సమాచారం చోరీ 

సోషల్‌ మీడియాను చీటింగ్‌కు వేదికగా మార్చుతున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన శ్రీధర్‌ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.2 లక్షల జీతం తీసుకుంటున్న శ్రీధర్‌కు వారం రోజుల క్రితం ఓ గుర్తు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘సార్‌ మీ ఏటీఎం కార్డ్‌ను అప్‌గ్రేడ్‌ చేసి పంపుతున్నాం, పాత కార్డు డీటైల్స్‌ చెబుతాం చెక్‌ చేసుకోండి’అని అన్నారు. శ్రీధర్‌ వద్ద ఉన్న ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్‌ను కూడా చెప్పారు. దీంతో నిజంగానే బ్యాంక్‌ కాల్‌ అనుకున్న శ్రీధర్‌.. కార్డు సీవీవీ నంబర్‌ చెప్పమని అడగడంతోనే చెప్పేశాడు. అంతే కార్డు స్వైపింగ్‌ చేసినట్టు క్షణాల్లో మొబైల్‌ నంబర్‌కు సందేశాలు వచ్చాయి. కంగుతున్న శ్రీధర్‌ హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా శ్రీధర్‌ మాత్రమే కాదు అనేక మంది ఉద్యోగులు, విద్యావంతులు సైతం విష్షింగ్‌ కాల్స్‌ గ్యాంగుల మోసానికి గురవుతున్నారు. ఏటా విషింగ్‌ కాల్స్‌ మోసాలపై నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. 

సైబర్‌ నేరాల్లో ఇవే టాప్‌ 
పెద్ద నోట్ల రద్దు తర్వాత అన్ని చెల్లింపులను ఆన్‌లైన్‌ ద్వారా చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే దీని చాటున నేరగాళ్లు పన్నుతున్న వలలో చిక్కిపోతున్నారు. కొందరు విషింగ్‌ కాల్స్‌కు మోసపోతే, మరికొందరు ఈమెయిల్‌ సందేశాలకు, ఇంకొందరు స్కిమ్మింగ్, క్లోనింగ్‌కు, ఫోన్‌ హ్యాకింగ్, రాన్‌సమ్‌ వేర్‌ అటాక్‌కు గురై డబ్బుతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో ఫోన్లు, మెయిల్స్‌ను హ్యాక్‌చేసి సైబర్‌ గ్యాంగులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నాయి. ఇక లాటరీల పేరుతో బురిడీ కొట్టిస్తూ నైజీరియన్‌ గ్యాంగులు భారీగా దోచుకుంటున్నాయి. రాష్ట్రంలో విషింగ్‌ కాల్స్‌తో మోసపోయిన కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  

బ్లాక్‌మెయిల్‌ 
రాష్ట్రంలో ఏటా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో అధిక శాతం డబ్బుకు సంబంధించినవి కాగా, కొన్ని సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలే. తెలియని వ్యక్తులతో పరిచయం అవడం, వారితో వ్యక్తిగత విషయాలను పంచుకునేలా చాటింగ్‌ చేయడం.. ఆపై ఎదుటి వ్యక్తి బ్లాక్‌మెయిలింగ్‌కు బయపడి లొంగిపోవడం జరుగుతున్న కేసులున్నాయి. అదేవిధంగా పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్‌ సైట్లలో తప్పుడు బయోడేటా పెట్టుకొని అమాయక యువతులను మోసం చేస్తున్న కేసులున్నాయి. రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజుతున్న కేసులు నమోదయ్యాయి. 

1 శాతం కూడా శిక్ష పడట్లేదు.. 
సైబర్‌ నేరాలు వేలాదిగా నమోదవుతున్నా.. నిందితులను గుర్తించడం, వారిని అరెస్ట్‌ చేయడం కష్టసాధ్యమవుతోంది. సోషల్‌ మీడియాలో వేధింపులు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వారిని అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు వారికి శిక్షపడేలా చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. వందలో 1 శాతం కేసుల్లో కూడా శిక్ష పడట్లేదు. 2016, 2017లో కేవలం 5 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షపడింది. సాధారణంగా సైబర్‌ నేరాల్లో ఆర్థిక నేరాలు ఎక్కువగా జరగడంవల్ల, బాధితుల డబ్బు కోల్పోకుండా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు బ్యాంకుల ద్వారా నేరస్తులకు డబ్బు చేరకుండా ఆపుతున్నారు. కానీ వేల కేసులు నమోదైతే.. నిందితులను అరెస్టు చేసింది కేవలం 29 శాతం కేసుల్లోనే. మిగిలిన కేసుల్లో నిందితులను గుర్తించడం కష్టంకాగా, గుర్తించిన వారిని విదేశాల నుంచి తెచ్చే అవకాశం లేకపోవడంతో కేసుల పెండింగ్‌ పెరిగిపోతోంది. ఈ మూడేళ్లలో సైబర్‌ నేరాల ద్వారా రూ. 32 కోట్ల మేర బాధితులు నష్టపోయినట్టు సీఐడీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు